మద్యానికి బానిసై భార్యను చంపిండు

దేవరకొండ(కొండమల్లేపల్లి), వెలుగు:  నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో  మద్యానికి బానిసైన సయ్యద్​ రహమాన్​ అలీ  అనే వ్యక్తి  బుధవారం తన భార్య సమీనా బేగం (30)ను రోకలి బండతో కొట్టి  హత్య చేశాడు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లికి చెందిన మహమూద్​ అలీ, సమీనా దంపతుల కూతురైన సమీనాబేగాన్ని రంగారెడ్డి జిల్లా మన్నెగూడకు చెందిన రహమాన్​అలీకిచ్చి పెండ్లి చేశారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు సంతానం. రహమాన్​అలీ  కొంతకాలంగా అత్తగారి ఊరైన కొండమల్లేపల్లి లో జేసీబీ డ్రైవర్​గా పని చేస్తూ భార్యా పిల్లలతో దేవరకొండ రోడ్డులోని వెంకటేశ్వరనగర్​ కాలనీలో  ఉంటున్నాడు.

బుధవారం పిల్లలను స్కూల్​కు పంపించిన తర్వాత ఇంట్లో ఉన్న  ఇద్దరికి ఘర్షణ జరిగింది. దీంతో మద్యం మత్తులో ఉన్న రహమాన్​అలీ కోపంతో రోకలి బండతో సమీనాబేగం తలపై బలంగా కొట్టడంతో ఆమె చనిపోయింది. రహమాన్​ అలీ ఇంటి తలుపులు దగ్గర పెట్టి పరారయ్యాడు. సాయంత్రం స్కూల్​ నుంచి ఇంటికి తిరిగొచ్చిన పిల్లలు ఇంట్లో తల్లి చనిపోయి ఉండడాన్ని గుర్తించి అమ్మమ్మ,తాతయ్యకు చెప్పారు. మృతురాలి తండ్రి మహమూద్​అలీ ఫిర్యాదుతో  మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ వీరబాబు తెలిపారు.  ఘటనా స్థలాన్ని ట్రైనీ ఐపీఎస్​ శేషాద్రిని రెడ్డి, డీఎస్పీ నాగేశ్వర్​రావు సందర్శించి వివరాలు సేకరించారు.