అమూల్ బేబీ డిజైనర్ సిల్వెస్టర్ కన్నుమూత

అమూల్‌ బేబీ కార్టూన్ సృష్టికర్త సిల్వెస్టర్‌ డాకున్హా (80) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన మంగళవారం (జూన్‌ 20) ముంబాయిలో తుదిశ్వాస విడిచారు. సిల్వెస్టర్ డాకున్హా మృతిపట్ల ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా పలు సంఘటనలను హాస్య రూపంగా, గుర్తుండిపోయేలా అమూల్‌ బ్రాండ్‌ తనదైన శైలిలో ‘అమూల్‌ గర్ల్‌’ కార్టూన్లను రూపొందిస్తుంటుంది. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ‘అమూల్‌ గర్ల్‌’ రూపకర్త  సిల్వెస్టర్‌ కన్నుమూశారు. ‘అట్టర్లీ-బటర్లీ’ ప్రచారంతో 1966లో తొలిసారిగా ఆయన అమూల్‌ గర్ల్‌ కార్టూన్‌ను గీశాడు. దీంతో అప్పటి నుంచి ఈ కార్టూన్‌కు ఎంతో పేరు వచ్చింది.  

ఎరుపు రంగు చుక్కల ఫ్రాక్‌ (గౌన్) లో కనిపించే పాపాయి కారణంగా అమూల్ బ్రాండ్‌కు ఎంతో గుర్తింపు వచ్చింది. పిల్లలు ఎంతో ఇష్టపడే ముసి ముసి నవ్వులు, కోపం, చిరాకు, ఆశ్చర్యం వంటి అనేక హావభావాలతో రూపొందించిన అమూల్ బేబీ ఇప్పటికీ ఎంతో ఫేమస్ అనటంలో సందేహం లేదు.