పెళ్లి కాకుండా… కలిసుండడం కరెక్టేనా..?

లవ్ ఇన్ రిలేషన్ షిప్… ఇదో నయా కల్చర్. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కల్చర్. పెళ్లి కాకుండానే ఓ అమ్మాయి, అబ్బాయి నాలుగు గోడల మధ్య కలిసి బతికే ఈ కల్చర్ కొన్నేళ్ల కిందట మన దేశంలోకి ఎంటరైంది. మెట్రో సిటీస్​లో కాలుమోసింది. ఇప్పుడు పట్టణాలకు కూడా విస్తరించింది. ఉన్నన్ని రోజులు కలిసుంటారు. ఎవరికి నచ్చకున్నా ఒక్క మాటతో ‘బ్రేకప్’ చెప్పేస్తున్నారు. ఓ ఫ్యాషన్​గా చెలామణి అవుతున్న లివ్ ఇన్ రిలేషన్​షిప్ గురించి సడెన్​గా అందరూ మాట్లాడుతున్నారు. దానికి కారణం రాజస్థాన్ మానవ హక్కుల కమిషన్.

ఈ రిలేషన్​షిప్ కరెక్ట్ కాదన్నారు కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ ప్రకాశ్ తాంతియా. ఈ విషయంలో సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులపైనా అభ్యంతరాలు తెలిపారు. ఈ నయా కల్చర్ వల్ల ఆడవాళ్లు హక్కులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లివ్​ ఇన్​ రిలేషన్​ షిప్​పై జస్టిస్  ప్రకాశ్ తాంతియా, జస్టిస్ మహేశ్ చంద్ శర్మలతో కూడిన రాజస్థాన్ మానవ హక్కుల కమిషన్​ అభ్యంతరం చెప్పడానికి గల కారణాలు:

లివ్ ఇన్ రిలేషన్​షిప్ వ్యవస్థ పైకి చూడటానికి బాగానే ఉన్నా దీనివల్ల ఆడవాళ్లకు చాలా అన్యాయం జరుగుతోంది. కోరిక తీర్చుకుని ఆడవారిని వదిలేయడానికి మగవాళ్లు ఏర్పాటు చేసుకున్న అందమైన ముసుగు. లివ్ ఇన్ రిలేషన్ షిప్  ఆడవాళ్లకు న్యాయం చేయడానికి వారి హక్కులను కాపాడటానికి సహజీవనం వ్యవస్థలో మార్పులు అవసరం అంటున్నారు నిపుణులు.

పిల్లలకు ఎలాంటి హక్కులుండవు

లివ్ ఇన్ రిలేషన్ షిప్ వల్ల పిల్లలు కలిగితే వారికి ఎలాంటి హక్కులు ఉండవన్న విషయాన్ని కూడా హక్కుల కమిషన్  ప్రత్యేకంగా ప్రస్తావించింది. సహజంగా పిల్లలను స్కూళ్లలో చేర్చేటప్పుడు అప్లికేషన్ ఫాంలో తండ్రి పేరు రాస్తారు. అయితే లివ్ ఇన్ రిలేషిప్ లో పుట్టిన పిల్లలకు తండ్రి పేరు రాయడం చాలా ఇబ్బందిగా మారిందని కొందరు చెబుతున్నారు. ఫలానా వాళ్లు తమ తల్లిదండ్రులు అని ఈ పిల్లలు చెప్పుకునే పరిస్థితి ఉండదన్నది మరికొందరి అభిప్రాయం. జంట బ్రేకప్ అయితే పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి, ఎవరు పెంచాలి అనేది పెద్ద సమస్యగా మారిందంటున్నారు ఇంకొంతమంది.

పిల్లల చదువుల ఖర్చు ఎవరు భరించాలి అనే ప్రశ్న కూడా బ్రేకప్ జంట ముందుకు వచ్చే ప్రశ్న అంటున్నారు మరికొంతమంది. ఈ విషయంలో కొంతకాలం కలిసున్న జంట తగాదాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.సహజీవనం చేసే ఆడవాళ్ల పట్ల సమాజంలో మంచి అభిప్రాయం లేదన్న విషయాన్ని కూడా రాజస్థాన్ మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. వారిని మిగతావాళ్లు చాలా చులకన భావంతో చూస్తారని పేర్కొంది.

ఇది సోషల్ టెర్రరిజం

సహజీవనం కల్చర్​పై జస్టిస్ ప్రకాశ్ తాంతియాకి కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. 2017 ఆగస్టులో ఓ కేసు విచారణ సందర్భంగా లివ్ ఇన్ రిలేషన్​షిప్ వ్యవస్థపై ఆయన మండిపడ్డారు.  ఈ వ్యవస్థను ‘సోషల్ టెర్రరిజం’తో ఆయన పోల్చారు. సహజీవనం చేసేవారివల్ల చుట్టుపక్కల ఉండేవాళ్లు కూడా అభద్రత ఫీలవుతారని కామెంట్ చేశారు. ‘ఓ అమ్మాయి, ఓ అబ్బాయి ఇష్టపడి కలిసి బతకాలనుకుంటే అందుకు పెళ్లే సరైన పద్ధతి’ అని జస్టిస్ ప్రకాశ్ తాంతియా తేల్చి చెప్పారు. ఇష్టపడ్డ జంట పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికే కాదు, ఆమెకు పుట్టే పిల్లలకు కూడా చట్టపరంగా హక్కులు వస్తాయన్నారు. పెళ్లి ఫెయిలైతే  పరిస్థితి ఏమిటని భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదన్నారు.

కాలంతోపాటే విలువల్లోనూ మార్పులు

మారుతున్న కాలానికి తగ్గట్టు సమాజంలో విలువలు కూడా మారతాయంటున్నారు సహజీవనాన్ని సమర్థించేవారు.  ఎన్నో ఏళ్ల కిందట బాల్య వివాహాలు ఒక సంప్రదాయంగా ఉన్న విషయాన్ని  గుర్తు చేస్తున్నారు.  ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలకు పెళ్లి చేయాలని ప్రయత్నిస్తే అది నేరమవుతుందన్నారు. మన చట్టాల ప్రకారం హోమో సెక్స్  కూడా కొన్నేళ్ల కిందటి వరకు నేరమే.  సమాజంలో మారుతున్న విలువలకు తగ్గట్టు హోమో సెక్స్ నేరం కాదని కిందటేడాది సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. లివ్ ఇన్ రిలేషన్​షిప్​ని కూడా ఇదే దృష్టితో చూడాల్సిన అవసరం ఉందన్నారు.

ఒంటరితనం కూడా ఒక కారణం

ఎక్కువమంది సహజీవనాన్ని ఇష్టపడడానికి ఒంటరితనం ఒక కారణం అంటున్నారు సోషల్ సైంటిస్టులు. నార్త్ ఇండియాకు చెందిన చాలామంది అమ్మాయిలు సాఫ్ట్​వేర్ కంపెనీల్లో పనిచేస్తూ హైదరాబాద్,  బెంగళూరు నగరాల్లో సెటిలయ్యారు. సొంతూళ్లకు దూరంగా ఉండటంతో ఒంటరితనం ఫీలవుతారు.  తోడుకోసం తాపత్రయపడతారు. ఈ పరిస్థితుల్లో కొలీగ్స్​తో అభిప్రాయాలు షేర్ చేసుకుంటారు. ఈ ప్రక్రియలో మనసుకు నచ్చిన వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్​షిప్​లోకి వెళతారు.

అదీగాక, సహజంగా ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఆమె జీతంపై భర్త పెత్తనం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నా  అమ్మాయిలకు వాళ్ల సంపాదనపై ఎలాంటి హక్కులుండవు. సహజీవనంలో పరిస్థితి వేరేగా ఉంటుంది. అమ్మాయి జీతంపై అన్ని హక్కులు ఆమెకే ఉంటాయి. సహజీవనం ఎన్నాళ్లు సాగుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే ఆడవాళ్లు, తమ పిల్లలకు హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని సోషల్ సైంటిస్టులు అంటున్నారు.

ఈ కల్చర్ ఎందుకు పెరుగుతోంది?

నగరాలు, పట్టణాల్లో లివ్ ఇన్ రిలేషన్​షిప్ ఈ మధ్య బాగా పెరుగు తోంది. దీనికి చాలా కారణాలు న్నాయి. పెళ్లి అనే వ్యవస్థను చాలామంది అమ్మాయిలు వ్యతిరేకిస్తున్నారు. పెళ్లి అనే వ్యవస్థలో భర్తకు అణిగిమణిగి ఉండాల్సిన అవసరం ఉంటుందన్నది వీరి వాదన. ఇష్టం ఉన్నా లేకపోయినా భర్తను జీవితాంతం భరించాల్సి ఉంటుందంటున్నారు ఈ జనరేషన్ అమ్మాయిలు. సహజీవనంలో అలాంటి ఇబ్బందులు ఉండవు. నచ్చకపోతే రిలేషన్​షిప్​ని బ్రేకప్ చేసుకోవచ్చు. మళ్లీ కొత్త జీవితం మొదలుపెట్టవచ్చు.

అసలు సుప్రీంకోర్టు ఏమంది ?

సహజీవనం నేరం కాదని  2015 జూలైలో  సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు చెప్పిం ది. మేజర్లయిన ఓ అమ్మాయి, ఓ అబ్బాయి పరస్పరం ఇష్టపడితే కలిసి ఉండటంలో తప్పు లేదంది. లిన్ ఇన్ రిలేషన్​షిప్​ని సమాజం ఆమోదించిందని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్లా సి. పంత్ కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఇదే ఇష్యూకు సంబంధించి అంతకుముందు 2013, నవంబరు 28న కూడా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే సహజీవనం చేసే ఆడవారికి చట్టపరంగా ఎలాంటి సెక్యూరి టీ లేకపోవడంపట్ల ఆవేదన వ్యక్తం చేసిం ది. ఆడవాళ్లకే కాదు, వాళ్ల పిల్లలకు కూడా ఎలాంటి హక్కులు ఉండవని పేర్కొంది. ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకుని రిలేషన్​షిప్ బ్రేకప్ అయినా ఆడవారికి, పిల్లలకు హక్కులు లభించేలా చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

‘బ్రేకప్​’లూ ఎక్కువే

‘అభిప్రాయాలు కలిశాయి, కలిసి ఉంటున్నాం’ అని చెప్పే లివ్ ఇన్ రిలేషన్ కూడా తరచుగా బ్రేక్ అవుతోంది. పార్టనర్స్ విడిపోతున్నారు. సహజీ వనం మూణ్ణాళ్ల ముచ్చటగా మారిపో తోంది. విడి పోవడంతోనూ కథ ఆగడం లేదు. కొన్ని జంటలై తే విడిపోయాక ఒకరిపై మరొకరు పోలీసు స్టేషన్ల కు వెళ్లి కేసులు పెట్టుకుంటు న్నాయి. అయితే సహజీవనానికి  చట్టపరంగా ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టాలా అని పోలీసులు కూడా తికమక పడ్డ సందర్భాలు ఉన్నాయట. మగవాళ్లపై డొమెస్టి క్ వయెలెన్స్ కింద కేసులు పెట్టే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటున్నారు న్యాయ నిపుణులు.