వినాయకుడు..శివుడు, పార్వతిల కుమారుడు. వినాయకుడికి అనేక పేర్లు ఉన్నాయి. ఏ పేరిట పిలిచినా పలుకుతాడన నమ్మకం. మొత్తం 32 రకాల పేర్లతో పలుస్తుంటారు. సుముఖ, కపిల, గజకర్ణ, లంబోదర, వికాత్, బాల గణపతి, భక్తి గణపతి, ధుంధి గణపతి, దుర్గా గణపతి, ద్విజ గణపతి, ద్విముఖ గణపతి, ఏకదంత గణపతి, ఏకాక్షర గణపతి, హరిద్ర గణపతి, హీరాంబ గణపతి, క్షిప్ర గణపతి, క్షిప్ర ప్రసాద గణపతి, లక్ష్మీ గణపతి, మహా గణపతి, నృత్య గణపతి ఇలాంటి ఎన్నో పేర్లతో కొలుస్తుంటారు.
"శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే."
అంటూ మానవులు దేవతలలో ప్రథముడు, జ్యేష్ఠుడు అయిన గణపతిని అన్ని సందర్భాల్లోనూ పూజించటమే కాదు, దేవతలందరూ త్రిమూర్తులతో సహా పూజించినట్టు ఆధారాలున్నాయి.
గణపతికి ఉన్న నామాలలో బాగా ప్రసిద్ధమైనవి వినాయకుడు, గజాననుడు. గణనాథుడికి ఉన్న పన్నెండు నామాలలో ప్రతి దాని వెనక ఒక చరిత్ర ఉంది. ముఖ్యంగా వినాయకోత్పత్తి. వినాయకుడు గజాననుడు కావటానికి గల కారణాలు ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా ఉన్నాయి. అంతే కాదు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్టు కనపడుతుంది
- సృష్టి కార్యం ప్రారంభించేముందు బ్రహ్మ ప్రార్థించిన గణపతి. ఓంకార స్వరూపుడు.
కృతయుగంలో : కశ్యపునికి, అదితికి జన్మించి, 'మహోత్కటుడు' అనే పేరుతో దేవాంతక నరాంతక రాక్షసులను సంహరించాడు.
త్రేతాయుగంలో : మయూరేశుడుగా అవతరించి త్రిమూర్తులకు వారు కోల్పోయిన స్థానాలను తిరిగి ఇప్పించాడు. అప్పుడే బ్రహ్మ తన కుమార్తెలైన సిద్ధి, బుద్ధిలను వినాయకుడికిచ్చి వివాహం చేస్తాడు. ఈ అవతారంలో వినాయకుడి వాహనం నెమలి.
ద్వాపరయుగంలో : గజాననుడుగా అవతరించి, సింధూరుడనే రాక్షసుని సంహరించాడు. మనం వినాయక వ్రతకల్పంలో చదివే కథ ఈ గజాననునిదే...
కలియుగంలో : ధూమ్రకేతువుగా అవతరించి. అశ్వారూఢుడై ప్రతి ప్రాణిలో పెచ్చు పెరిగిన రాక్షస ప్రవృత్తిని నశింపజేస్తూ ఉన్నాడట.
బ్రహ్మాండ పురాణంలో జగదంబతో యుద్ధం చేస్తున్న భండాసురుడు.. సర్వవిఘ్నయంత్రాన్ని పన్నుతాడు. అప్పుడు శ్రీమాత 'మహేశ్వరముఖాలోశం'తో గణపతిని కల్పించినట్టు ఉంది. కనుకనే విఘ్నాలు పోవాలంటే విఘ్నేశ్వరుని పూజించటం సంప్రదాయమైంది.
బ్రహ్మవైవర్త పురాణంలో గజాననోత్పత్తి ఈ విధంగా ఉంది. ఒకమారు దేవతల రాక శివపార్వతుల క్రీడకు అంతరాయం కలిగించటంతో శివుని వీర్యం కింద -పడింది. అదే ఒక బాలుడి రూపు తీసుకుంది. పార్వతి ఆ బాలుడిని పెంచి పెద్దచేసి, ఒకనాడు శివునికి చూపించగనే ఆ బాలుని శిరస్సు ముక్కలవుతుంది. దానికి కశ్యపుని శాపం కారణం. ఒకప్పుడు శివుడు సూర్యుని సంహరించగా, కశ్యపుడు తన కుమారుని బ్రతికించుకుని శివుడు తన కుమారుని చూడగానే ఆ బాలుని తల పక్కలవుతుంది అని శపించాడు. పార్వతీదేవి బాధ పోగొట్టటానికి శివుడు దేవతలని ఆజ్ఞాపించగా, వారు పుష్పభద్రా నదీతీరాన ఉత్తరదిక్కుగా తల పెట్టుకుని నిద్రిస్తున్న ఏనుగుతలని తీసుకుని వచ్చి ఆ బాలుని మొండానికి అంటిస్తారు. దానితో ఆ బాలుడు గజాననుడయ్యాడు.
వరాహ పురాణంలోని గజాననోత్పత్తి మరొకవిధంగా ఉంది. ఒకానొక సమయంలో దేవతలు, మునులు శివుని వద్దకు వెళ్ళి, రాక్షసబాధ పోగొట్టమనిప్రార్థించారు. సరేనని వారిని పంపి, ఆకాశం వంక చూసి, నీటికి, నేలకి ఒక రూపం ఉండగా ఆకాశానికెందుకు లేదు? అని ప్రశ్నిస్తుండగా జగన్మోహన రూపంతో పార్వతి శివుని కంట పడుతుంది. ఆ కారణంగా ఆకాశం పుత్రరూపంలో శివుని ఎదుట ప్రత్యక్షమైంది.
ఆ సుందరరూపం పార్వతీదేవితో పాటు దేవతాస్త్రీలందరి చిత్తాలను భ్రమింపచేయగా.. శివుడు కోపించి ఆ బాలుని ఏనుగు. తొండము, బొర్రకడుపు, జంధ్యాలుగా పాములు కలవాడై పొమ్మని శపించాడు. ఇంకా కోపం తగ్గక శరీరమంతా చెమరించింది. ఆ చెమటబొట్ల నుండి గజాస్యులు పుట్టారు. దేవతలు శివుని ప్రార్థించి శాంతింపజేశారు. గజాస్యులు అబాలునికి పరివారమౌతారని, ప్రతికార్యంలోనూ అతడు ముందుగా పూజించబడతాడని శివుడు ఆ బాలునికి వరమిచ్చాడు.
శివపురాణంలోని కథలో మనం బ్రహ్మచారిగా భావించుకొనే వినాయకునికి వివాహం జరిగినట్టు ఉంది. కుమారస్వామి, వినాయకులలో ముందు. ఎవరికి పెళ్ళి చేయాలి? అనే ప్రశ్న ఉదయించినప్పుడు, ముందుగా భూలోకాన్ని చుట్టివచ్చిన వారికి పెళ్ళిచేస్తాను అని శివుడు చెబుతాడు. కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం ఎక్కి బయల్దేరాడు. వినాయకుడు కొద్దిగా ఆలోచించి, స్నానంచేసి వచ్చి, పార్వతీపరమేశ్వరులకు ప్రదక్షిణలు చేసి తాను భూలోకాన్ని చుట్టి వచ్చినట్టు వారి చేత అంగీకరింపజేశాడు. సిద్ధి, బుద్ధి అనే భార్యలను, క్షేముడు, లాభుడు అనే కుమారులను పొందాడు. నిజానికి సిద్ధి, బుద్ధి వినాయకుని శక్తులు. క్షేమం, లాభం వినాయకుని సేవించుకున్నందువల్ల వచ్చే ఫలితాలని పురాణాల ద్వారా తెలుస్తోంది.
బ్రహ్మాండ పురాణం- వినాయకుడు ఏకదంతుడవటానికి గల కారణాన్ని చెబుతుంది. కార్తవీర్యుని చంపిన పరశురాముడు.. శివుని దర్శించుకోవటానికి వచ్చినపుడు గుమ్మంవద్ద కాపలా ఉన్న వినాయకుడు ఆపుతాడు. పరశురాముడు ఎదిరించగా యుద్ధం జరిగింది. వినాయకుడు తొండంతో పరశురాముని పైకెత్తాడు.. భయపడి గొడ్డలితో కొట్టగా వినాయకుని దంతాలలో ఒకటి విరిగి పడింది.అందుచేత వినాయకుడు ఏకదంతుడయ్యాడు.
మనకందరికీ బాగా తెలిసి వ్యాప్తిలో ఉన్న కథ స్కందపురాణంలోనిది. గజాసురుని తపస్సుకి మెచ్చి అతడు కోరినట్టు అతడి ఉదరంలో ఉండిపోయాడు శివుడు. పార్వతి అడిగిందని విష్ణుమూర్తి గజాసురుని వద్దకు వెళ్ళి, గంగిరెద్దుల మేళం ఆడించి, వాడిని మెప్పించి, శివుడ్ని ఇమ్మని అడిగాడు. గజాసురుడు తన గర్భంలో ఉన్న శివుడు తన శిరస్సుని త్రిలోకపూజ్యంగా చేయాలని, శివుడు తన చర్మాన్ని ధరించాలని కోరాడు. నందీశ్వరుడు తన కొమ్ములతో చీల్చగా శివుడు బయటపడి, విష్ణువుని కీర్తించి కైలాసానికి బయల్దేరతాడు.
భర్త వస్తున్న వార్త తెలిసిన పార్వతి అభ్యంగనస్నానం చేస్తూ, నలుగుపిండితో ఒక బాలుని విగ్రహం చేసి, ప్రాణం పోసి వాకిట్లో కాపలాపెట్టింది. ఆ బాలుడు శివుని అడ్డగించగా శివుడాతని శిరస్సు ఖండించాడు. ఆ తరువాత పార్వతి దేవి వినాయకుడి గురించి శివుడిని అడుగగా అప్పుడు తాను చేసిన పనికి చింతించి.. గజాశురుడి తలను వినాయకుడికి అమర్చి ప్రాణం పోశాడని స్కంద పురాణంలో ఉంది,