హైదరాబాద్, వెలుగు: ఇంటర్‌కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇండియా నిరాశపరిచింది. మూడోసారి ట్రోఫీ నెగ్గాలని ఆశించిన ఇండియాకు సిరియా షాకిచ్చింది. సోమవారం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో సిరియా 3–-0తో ఇండియాను ఓడించింది. వరుసగా రెండో మ్యాచ్‌లో విజయంతో తొలిసారి టైటిల్ సొంతం చేసుకుంది. గత మ్యాచ్‌లో మారిషస్‌తో డ్రా చేసుకున్న ఇండియా ట్రోఫీ నెగ్గాలంటే సిరియాపై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఆట మొత్తంలో ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది.
మరోవైపు సిరియా పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. ఏడో నిమిషం మహ్మౌద్ అల్ అస్వద్ తొలి గోల్ కొట్టగా.. సెకండాఫ్‌లో డాలెహో మోహ్‌సెన్ 77 నిమిషంలో ఆ జట్టుకు మరో గోల్ అందించాడు. ఇంజ్యూరీ టైమ్‌లో పాబ్లో సబాగ్ మరో గోల్ చేసి ఆతిథ్య జట్టుకు షాకిచ్చాడు. ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ సీఎం ఎ. రేవంత్‌రెడ్డి విన్నర్ సిరియాకు ట్రోఫీ, రూ. 30 లక్షల ప్రైజ్‌మనీ చెక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్జ్) చైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధికారులు పాల్గొన్నారు.