పార్టీ కోసం పనిచేసినోళ్లకే పదవులు .. మీడియాతో పార్టీ విషయాలు మాట్లాడితే చర్యలు తప్పవ్: మీనాక్షి నటరాజన్

పార్టీ కోసం పనిచేసినోళ్లకే పదవులు .. మీడియాతో పార్టీ విషయాలు మాట్లాడితే చర్యలు తప్పవ్: మీనాక్షి నటరాజన్
  • ఇబ్బందులు ఏమున్నా పార్టీ వేదికలపైనే చెప్పాలి
  • నేతలు ఇష్టారీతిన మాట్లాడటం వల్లే సర్కారుపై వ్యతిరేకత  
  • మెదక్, మల్కాజిగిరి నేతల మీటింగ్ లో క్లాస్ తీసుకున్న పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్లలో చేయలేని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలోనే చేసిందని, అయినా ప్రజల్లో సానుకూలతకు బదులుగా వ్యతిరేకత ఎందుకు కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలను ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు. పార్టీలోని పాత, కొత్త నేతల మధ్య సమన్వయం లేకపోవడం, పాజిటివ్  విషయాలను పక్కనపెట్టి, నెగెటివ్ విషయాలనే ఎక్కడపడితే అక్కడ మాట్లాడడంతోనే పార్టీపై, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని ఆమె ఫైర్ అయ్యారు. 

ఇకముందు పార్టీ నేతల తీరు మారాలని క్లాస్ తీసుకున్నారు. మంగళవారం గాంధీభవన్ లో పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మెదక్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల కాంగ్రెస్ ముఖ్య నేతల సమీక్షా సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు మీనాక్షి నటరాజన్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితిని, కొత్త, పాత నేతల మధ్య సమన్వయం తీరును, లోక్ సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా పార్టీకి వచ్చిన ఓట్ల వివరాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఏ స్థాయిలో తీసుకెళ్తున్నారనే దానిపై ఆమె నేతలను అడిగి తెలుసుకున్నారు. 

సమావేశంలో నేతలందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారు. అనంతరం మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. పార్టీలో ఎలాంటి ఇబ్బందులున్నా, నేతల నుంచి సమస్యలు ఎదురైనా పార్టీ వేదికలపైనే నాయకత్వం దృష్టికి తేవాలన్నారు. కొందరు బహిరంగంగా మాట్లాడటం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతోనే పార్టీ ప్రతిష్టకు ఇబ్బంది ఏర్పడిందన్నారు. ఇకపై ఎవరైనా పార్టీ విషయాలపై మీడియాతో మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

పనితీరును బట్టే పదవులు..

పార్టీలో నేతలు ఎవరూ పదవులు అడగరాదని, పని తీరును బట్టే పదవులు ఇస్తామని మీనాక్షి నటరాజన్ తేల్చిచెప్పారు. గాంధీభవన్ లో హడావుడి చేస్తేనో, నేతల చుట్టూ తిరిగితేనో పదవులు రావన్నారు. ఎవరు జనం మధ్యలో ఉండి పని చేస్తున్నారు? అన్నది పార్టీ నాయకత్వం ఎప్పటికప్పుడు తెలుసుకుంటుందన్నారు. కనీసం పదేండ్లపాటు పార్టీ కోసం పనిచేసిన నేతలకే డీసీసీ, కార్పొరేషన్ పదవులు ఇస్తామన్నారు. మెదక్ మీటింగ్ లో పటాన్ చెరులో పార్టీ పరిస్థితి అంశం ప్రస్తావనకు వచ్చింది. పార్టీ ఇన్ చార్జ్ కాట శ్రీనివాస్ కు, అక్కడ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మధ్య కొరవడిన సమన్వయంపై కూడా ఆమె ఆరా తీశారు. 

కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, అందరికీ న్యాయం చేస్తామని, కొత్తవారిని కలుపుకునిపోతామని తెలిపారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెడతానని, అక్కడ బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యచరణను రూపొందిస్తామని పార్టీ నేతలకు చెప్పారు. మంత్రి దామోదర రాజనర్సింహా ఈ రెండు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టి, కార్యకర్తల కు అందుబాటులో ఉండాలని కోరారు. జై బాపూ, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లడంపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణ వంటి నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. మంత్రులు, ఇన్ చార్జ్ మంత్రులు కూడా జిల్లాల్లో పర్యటించి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు. 

గ్రేటర్ పై మంత్రులు దృష్టి పెట్టాలి.. 

గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఎమ్మెల్యేలు ఎవరూ లేరని, ఇన్ చార్జ్ మంత్రి, ఇతర మంత్రులు ఈ ప్రాంతంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని మల్కాజిగిరి నియోజకవర్గ నేతలు కొందరు మీనాక్షి నటరాజన్ కు విజ్ఞప్తి చేశారు. సిటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పెత్తనం ఎక్కువైందని, అధికారులు పార్టీ నేతలను సమన్వయం చేసేలా చూడాలని కోరారు. రైతు భరోసా, పెన్షన్ లపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టేలా చూడాలన్నారు. 

ఇందిరమ్మ కమిటీలను గ్రేటర్ పరిధిలో కూడా వేయాలని, నియోజకవర్గ ఇన్ చార్జీలకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. మెదక్, మల్కాజిగిరి నియోజకవర్గాల రివ్యూ మీటింగ్ కు మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహా, కొండా సురేఖ, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. కాగా, గాంధీ భవన్ లో బుధవారం మరో రెండు పార్లమెంట్ నియోజకవర్గాల రివ్యూ మీటింగ్ లు జరగనున్నాయి. 

విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి: మహేశ్ గౌడ్ 

ప్రభుత్వంపై ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. వీటిని నేతలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణ వంటి  చాలా గొప్ప నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందని, వీటిని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని కోరారు. వాస్తవాలను ప్రజలకు వివరించి, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలకు చెక్ పెట్టాలని సూచించారు.

మీటింగ్ లో మీనాక్షి నటరాజన్ మార్క్

గాంధీ భవన్ లో ఎప్పుడు మీటింగ్ లు నిర్వహించినా పార్టీ నేతల హడావుడి, హంగామా కనిపించేది. పైగా సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పోటీపడేవారు. కానీ  మంగళవారం జరిగిన మీటింగ్ సందర్భంగా మీనాక్షి మార్క్ స్పష్టంగా కనిపించింది. మీటింగ్ విషయాలను ఎవరూ మీడియాకు చెప్పరాదని ఆమె స్పష్టంగా ఆదేశించడంతో.. బయటకు రాగానే నేతలు మీడియాకు ముఖం చాటేశారు. నేరుగా ఎవరి కారు ఎక్కి వారు వెళ్లిపోయారు.