- నడ్డా సమక్షంలో కాషాయదళంలోకి మహేశ్వర్‌రెడ్డి
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మారనున్న రాజకీయ చిత్రం
నిర్మల్, వెలుగు: ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. గురువారం బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమక్షంలో ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకున్నారు.మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడనున్నారంటూ కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలను చివరికి ఆయన నిజం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా ఉంటూ వస్తున్న మహేశ్వర్ రెడ్డి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి దీటుగా నిలబడ్డారు. నిర్మల్‌తోపాటు ఉమ్మడిజిల్లావ్యాప్తంగా కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా ఉన్న ఆయన బీజేపీలో చేరడంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.
పాదయాత్రను అడ్డుకోవడంపై నారాజ్
కాంగ్రెస్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గానికి చెందిన నేతగా గుర్తింపు పొందిన మహేశ్వరరెడ్డికి మొదటినుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో విభేదాలున్నాయి. రేవంత్ తీరుపై ఆయన అనేకసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డికి దీటుగా మహేశ్వర్ రెడ్డి నిర్మల్ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టారు. పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే ఆయన యాత్రను అడ్డుకున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఠాక్రే కు లేఖ రాశారు. అప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నారు. చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కొంతకాలంగా మహేశ్వరరెడ్డితో టచ్‌లో ఉన్నారని, ఆయన బీజేపీలోకి ఆహ్వానించారని అంటున్నారు. కాంగ్రెస్‌లో కొనసాగలేకచివరికి ఆయన బీజేపీలో చేరారు.
మూడు సెగ్మెంట్లలో ప్రభావం
మహేశ్వర్ రెడ్డిబీజేపీలో చేరడంతో నిర్మల్ జిల్లా రాజకీయం పూర్తిగా మారనుంది. ఆయన చేరికతో నిర్మల్, ముధోల్, ఖానాపూర్ సెగ్మెంట్లలో బీజేపీ బలం పెరిగింది. ఈ సెగ్మెంట్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు గట్టి పోటీ తప్పదని పరిశీలకులు అంటున్నారు. రాజకీయ ఎత్తుగడలు వేయడంలో, వ్యూహరచనలో దిట్టగా భావించే మహేశ్వర్ రెడ్డికి జిల్లాలో గట్టి పట్టుఉంది. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఢీకొంటూ తన బలాన్ని పెంచుకుంటూవచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ లీడర్లు భారీగా బీజేపీలో చేరే అవకాశం ఉంది. నిర్మల్డీసీసీ ప్రెసిడెంట్ ముత్యం రెడ్డి ఇప్పటికే మహేశ్వర్‌రెడ్డి వెంటే ఉంటానని ప్రకటించారు. అదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోనూ ఆయనకు సంబంధాలున్నాయి. ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్లీడర్లు కూడా బీజేపీలోకి వచ్చే చాన్స్ ఉంది. ఢిల్లీ నుంచి రాగానే తన మద్దతుదారులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత జిల్లాలో బీజేపీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించనున్నట్టు చెప్తున్నారు.
పీఆర్పీ నుంచి అసెంబ్లీకి...
మహేశ్వర్ రెడ్డి 2006లో మహేశ్వర ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. నిర్మల్ నియోజకవర్గం అంతా పాదయాత్రలు చేపట్టి ప్రజలకు దగ్గరయ్యారు. 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీ తరపున నిర్మల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీహరి రావును ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైంది. అప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉంటున్నారు. 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోయారు. 2015లో ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ నిర్మల్ జిల్లాలో పాదయాత్ర చేశారు. 2021లో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా నియమించారు.