పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా హాస్పిటల్ క్యాంపస్‌లో టీ హబ్ డయాగ్నస్టిక్ సెంటర్ బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది. కావాల్సిన ఎక్విప్‌మెంట్ అందించడంలో సర్కార్ నిర్లక్ష్యం చేస్తుండడంతో డయాగ్నస్టిక్ సెంటర్‌ను ఓపెన్ చేయడం లేదు. మరోవైపు దశాబ్ది ఉత్సవాల పేరుతో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు బిజీగా ఉన్నారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో టెస్ట్ ఎక్విప్‌మెంట్ పెంచాల్సి ఉండగా ఆ దిశగా వైద్య శాఖ దృష్టి సారించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్లు మాత్రం ఎక్విప్మెంటు రావాల్సి ఉందని, దానిని ఇన్‌స్టాల్ చేయడానికి దాదాపు నెల రోజులు పడుతుందంటున్నారు. గతంలో ఎలాంటి సౌకర్యాలు, ఎక్విప్‌మెంట్ లేకుండానే మంత్రి హరీశ్‌రావుతో ఎంసీహెచ్ ఓపెన్ చేయించడంతో విమర్శలు వచ్చాయి. ఈసారి మొత్తం ఎక్విప్‌మెంట్ వస్తేనే ఓపెన్ చేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలో డయాగ్నస్టిక్ సెంటర్ ఓపెనింగ్ లేట్కానుంది.
రూ. 1.05 కోట్లతో నిర్మాణం...
ప్రభుత్వం 2018 నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రధాన హాస్పిటళ్లలో డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెద్దపల్లి ఆసుపత్రిలో పోయినేడు మంత్రి హరీశ్‌రావు ఎంసీహెచ్ ఓపెనింగ్‌కు వచ్చినప్పుడు డయాగ్నస్టిక్ సెంటర్ నిర్మాణానికి రూ.1.05 కోట్లు మంజూరు చేశారు. అనంతరం సెంటర్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. డయాగ్నస్టిక్ సెంటర్‌లో పరికరాల కోసం రూ. 50 లక్షలు కూడా మంజూరయ్యాయి. అయితే మొత్తం ఎక్విప్‌మెంట్ రాకపోవడంతో సెంటర్‌ను ప్రారంభించడం లేదు. ఈ సెంటర్ స్టార్ట్ అయితే 57 రకాల పరీక్షలను ఉచితంగా చేయవచ్చు. చిన్న రోగమొచ్చినా రక్త, యూరిన్ టెస్ట్‌లు చేయాల్సి వస్తుంన్నందున సెంటర్‌ను ఓపెన్ చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.
సీబీపీ, వైడల్, మలేరియా, యూరిన్.. వంటి టెస్ట్‌లు చేయించుకునేందుకు ప్రజలు ప్రైవేట్ సెంటర్లకు పోయి రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. పెద్దపల్లిలోనే డయాగ్నస్టిక్సెంటర్ అందుబాటులోకి వస్తే జిల్లాలోని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు, పట్టణ ఆరోగ్యకేంద్రాలకు వచ్చే రోగులకు అన్ని రకాల పరీక్షలు ఇక్కడే చేస్తారు. దీనివల్ల రిపోర్టులు తొందరగా వచ్చి, రోగ నిర్ధారణకు అవకాశం ఉంటుంది. ప్రైవేటు సెంటర్లలో దోచుకుంటున్నారుకరోనా కాలం నుంచి డయాగ్నోస్టిక్ సెంటర్ల అవసరం పెరిగింది. రోగులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే వివిధ టెస్టుల పేరు మీద రూ. వేలు దండుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంతోపాటు గోదావరిఖని, మంథనిల్లోని ప్రైవేటు సెంటర్లు టెస్టుల పేరుతో రోగులను దోపిడీ చేస్తున్నారు. దీంతో పేద రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆధునిక పరికరాలతో డయాగ్నస్టిక్సెంటర్ అందుబాటులోకి వస్తే పేద ప్రజలకు ప్రయోజనం ఉంటుంది.
నెల రోజుల్లో అందుబాటులోకి..
డయాగ్నస్టిక్ సెంటర్ బిల్డింగ్ పూర్తయింది. ఎక్విప్మెంటు పూర్తిస్థాయిలో రావాల్సి ఉంది. ఎక్విప్మెంటు వచ్చాక వాటిని ఇన్‌స్టాల్ చేసేందుకు కొంత టైం పడుతుంది. మరో నెలలో సెంటర్అందుబాటులోకి వస్తుంది. రక్త, మూత్ర పరీక్షలకు సంబంధించి అన్ని టెస్టులు ఇక్కడ చేస్తారు. 24 గంటల్లోనే టెస్టు రిపోర్టులు వస్తాయి. దీంతో ట్రీట్మెంటు ఈజీ అవుతుంది.
- శ్రీధర్, డీసీహెచ్, పెద్దపల్లి