- ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా, ఆధునిక సాంకేతికతకు చిరునామాగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోసైన్స్, టెక్నాలజీ రంగాల్లో దిగ్గజ సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. బుధవారం న్యూజెర్సీ ఇన్నొవేషన్స్ ఇనిస్టిట్యూట్, న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలతో టీ-హబ్ ఫౌండేషన్.. వాణిజ్య, సాంకేతిక ఆవిష్కరణలపై ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడారు. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు. తద్వారా ఇండియన్ అమెరికన్లు, వృత్తి నిపుణులకు న్యూజెర్సీ అవకాశాలను కల్పిస్తోందన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రం మరింత వృద్ధిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ లెఫ్టినెంట్ గవర్నర్ తాహెషా వే, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టీ హబ్ సీఈవో సుజిత్ జాగిర్దార్, చీఫ్ డెలివరీ ఆఫీసర్ ఫణి కొండేపూడి తదితరులు పాల్గొన్నారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో నాస్కామ్ భాగస్వామి కావాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. బుధవారం సెక్రటేరియెట్లో ఆయనతో నాస్కామ్ అధ్యక్షుడు రాజేశ్ నంబియార్ భేటీ అయ్యారు. ఐటీ ఉద్యోగులు, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఏఐపై శిక్షణ ఇచ్చేందుకు, జీసీసీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు నాస్కామ్ తోడ్పాటును అందించాలని కోరారు.