ఈసీ అంటే… శేషనే!

ఎవరినైనా రిటైరైన మర్నాడే జనాలు మరిచిపోతుంటారు. టి.ఎన్​.శేషన్​ని మాత్రం పాతికేళ్లయినా ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. వ్యవస్థ నడుస్తున్న తీరుపై అసహనం ఏర్పడిన ప్రతిసారీ శేషన్​లాంటి ఆఫీసర్​ ఉండాలనుకుంటారు. అంత బలమైన ముద్ర వేసిన వ్యక్తి శేషన్​. ఎన్నికలప్పుడు తప్ప ఎవరూ పెద్దగా పట్టించుకోని ఎలక్షన్​ కమిషన్​ని పవర్​పుల్​గా తీర్చిదిద్దిన ఘనత ఆయనదే. అస్తవ్యస్తంగా ఉండే ఎన్నికల వ్యవస్థపై తనదైన మార్క్ వేశారు.

అవి ఎలక్షన్ కమిషన్ అంటే ఒక సాదా సీదా గవర్నమెంట్ ఆఫీసు అని అందరూ అనుకునే రోజులు. ఎన్నికల సంఘానికి అసలు అధికారాలు ఉన్నాయా? ఉంటే ఎంతవరకు? అనే విషయాలు కూడా ఎవరికీ తెలియవు. అలాంటి పరిస్థితుల్లో 1990 డిసెంబర్ 1న చీఫ్ ఎలక్షన్ కమిషనర్​గా శేషన్ పగ్గాలు చేపట్టారు. అప్పటికి దేశంలో ఎన్నికల నిర్వహణ  గందరగోళంగా ఉండేది. విచ్చలవిడిగా పోలింగ్ కేంద్రాల ఆక్రమణ జరిగేది. బ్యాలెట్ పేపర్లను చించేసేవారు. దౌర్జన్యంగా పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించి గంపగుత్తగా ఒకే గుర్తుకు ఓట్లేసేవారు.  ఒక్కోసారి బ్యాలెట్​ బాక్స్​లు ఎత్తుకుపోయేవారు. వాటిలో ఇంకు పోసేసి ఓట్లు చెల్లకుండా చేసేవారు. వీటికి చెక్ పెట్టడానికి ఎన్నికల సంఘం అంటూ ఒకటుందని ఎవరికీ గుర్తొచ్చేది కాదు. అలాంటి పరిస్థితుల్లో సీఈసీగా బాధ్యతలు స్వీకరించారు శేషన్.  ఈసీ​ పవరేంటో పార్టీలకు చూపించారు.

ఎన్నికల వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నూటికి నూరు శాతం అమలు చేయించారు. డ్యూటీ విషయంలో చండ శాసనుడిలా వ్యవహరించారు. అక్రమాలకు పాల్పడాలంటే జంకేలా చేశారు. రూల్స్​ని ఎవరు బ్రేక్ చేసినా తక్షణం యాక్షన్ తీసుకునే వారు. డ్యూటీ విషయంలో శేషన్ ఎంత నిక్కచ్చిగా ఉంటారో చెప్పడానికి మధ్యప్రదేశ్ ఎన్నికల విషయం చెబితే సరిపోతుంది. మధ్యప్రదేశ్​లోని ఓ నియోజకవర్గంలో అప్పటి గవర్నర్ కొడుకు పోటీ చేస్తున్నారు. అతని కోసం సాక్షాత్తూ గవర్నర్ వచ్చి ప్రచారం చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆ నియోజకవర్గంలో పోలింగ్​ని శేషన్ సస్పెండ్ చేశారు.

ఈసీని తీర్చిదిద్దిన ఘనుడు

ఎలక్షన్​ కమిషన్​ని స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థగా తీర్చిదిద్దిన ఘనత శేషన్​దే. ఎన్నికల నిర్వహణకు అవసరమైతే పారా మిలటరీ సేవలు ఉపయోగించుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోసైతం ఎలాంటి అక్రమాలు జరగకుండా ఎన్నికలు జరిపించారు. అక్రమాలు జరిగే చాన్స్​ ఉందని ఏమాత్రం సమాచారం అందినా వెంటనే అలర్ట్ అయ్యేవారు. ఆయా ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించే ఏర్పాట్లు చేసేవారు.  ఓటు వేయడానికి భయపడేవాళ్లు కూడా శేషన్ ఇచ్చిన భరోసాతో పోలింగ్​ స్టేషన్లకు ధైర్యంగా వెళ్లేవారు. దీంతో దేశంలో పోలింగ్ శాతం పెరిగింది. అప్పట్లో బీహార్, ఉత్తరప్రదేశ్​లో పోలింగ్ రోజున హింస ఎక్కువగా జరిగేది. దీనిపై శేషన్  ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సెన్సిటివ్​ ఏరియాల్లో పెద్ద ఎత్తున బలగాలను పంపించి  హింసకు తావు లేకుండా చేశారు.

ఎన్నికల పరిశీలకుల ఎంట్రీ

ఎన్నికల ప్రచారం, కేండిడేట్లు పెట్టే ఖర్చుపై  నిఘా వేయడానికి ఒక్కో లోక్​సభ నియోజకవర్గానికి ముగ్గురేసి చొప్పున  అబ్జర్వర్లను ఎన్నికల సంఘం పంపింది. రిపోర్టును బట్టి చర్యలు తీసుకునేవారు. ఒక్కోసారి పోలింగ్ నిలిపివేయడం వంటి అసాధారణ చర్యలు కూడా తీసుకునేవారు.

శేషన్​ని తట్టుకోలేక…

శేషన్  చీఫ్ ఎలక్షన్ కమిషనర్​గా తీసుకున్న నిర్ణయాలకు తిరుగుండేది కాదు. ఇది రాజకీయ పార్టీలకు మింగుడుపడలేదు. దీంతో శేషన్​ని కంట్రోల్​ చేసే ఉద్దేశంతో 1993లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈసీని ముగ్గురు సభ్యుల కమిషన్​గా మార్చింది. ఎం.ఎస్.గిల్, జి.వి.జి.కృష్ణమూర్తి సభ్యులుగా ప్రవేశించారు. అయినప్పటికీ ఎన్నికల్ని ఫ్రీ అండ్​ ఫెయిర్​గా నిర్వహించడంలో వాళ్లుకూడా శేషన్​కి సహకరించారు. సీఈసీ హోదాలో  శేషన్ తీసుకున్న చర్యలకు దేశ ప్రజల ఆమోదం లభించింది. లోక్​సభ లేదా అసెంబ్లీ ఎన్నికలు ఇంత సజావుగా జరుగుతున్నాయంటే… అప్పట్లో శేషన్ అమలు చేసిన సంస్కరణల ఫలితమే అని చెప్పక తప్పదు.

గోడల మీద రాతలకు చెక్​

ఇంట్లో శుభకార్యం జరుగుతున్నా ఎలక్షన్​ సీజన్​లో వైట్​వాష్​ చేయించుకోవడానికి జనం జంకేవారు. పార్టీల కార్యకర్తలకు తెల్ల గోడ కనిపిస్తే చాలు, తెల్లారేసరికల్లా ఎన్నికల స్లోగన్లతో నానా కంగాళీగా మార్చేసేవారు. ఫలానా పార్టీకే ఓటేయండంటూ వాల్​ రైటింగ్స్​ నింపేసేవాళ్లు. శేషన్​ ఈ రకమైన ప్రచారాన్ని సీరియస్​గా తీసుకున్నారు. ఏ పార్టీ లేదా కేండిడేట్​ గోడలపై కాన్వాసింగ్​కి దిగితే… వాళ్లను అనర్హులుగా ప్రకటిస్తామని ప్రకటించారు. దీంతో మంత్రం వేసినట్లుగా గోడల మీద రాతలు మాయమయ్యాయి.

పాలక్కాడ్ నుంచి ఢిల్లీకి

శేషన్ సొంతూరు కేరళలోని పాలక్కాడ్. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ చేశారు. తరువాత అదే కాలేజీలో మూడేళ్ల పాటు ట్యూటర్​గా పనిచేశారు. ఆ సమయంలోనే సివిల్స్​ రాసి, 1955 బ్యాచ్​లో తమిళనాడు కేడర్​కి సెలెక్ట్ అయ్యారు. తమిళనాడు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు వహించి, 1972లో కేంద్ర సర్వీసుకి వెళ్లిపోయారు.   రాజీవ్ గాంధీ హయాంలో కేబినెట్ సెక్రటరీగా పనిచేశారు. చంద్రశేఖర్​ ప్రధానిగా ఉన్నప్పుడు 1990లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్​గా నియమితులై 1996 వరకు అదే హోదాలో  కొనసాగారు. ఆయన సేవలకు గుర్తుగా రామన్​ మెగసెసే అవార్డు లభించింది.  రిటైరయ్యాక 1997లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి కె.ఆర్.నారాయణన్ చేతిలో ఓడిపోయారు.  1999లో గాంధీనగర్​ (గుజరాత్​) నుంచి లోక్​సభకు ఎల్​.కె.అద్వానీపై పోటీకి దిగి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత పూర్తిగా రిటైర్మెంట్​ లైఫ్​ గడిపారు.

శేషన్ సంస్కరణలు 

  •  ప్రతి ఓటరుకి గుర్తింపు కార్డు
  • కేండిడేట్ల ఎన్నికల ఖర్చుపై కంట్రోల్​
  • కులం, మతం ఆధారంగా ఓట్లు అడగటంపై నిషేధం
  • పక్కాగా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలు
  • గోడల మీద రాతలు నిషేధం
  • టైమ్​ లోపలే లౌడ్ స్పీకర్ల వాడకం
  • ప్రచార సభలకు కాల పరిమితి
  • ఎన్నికల ఖర్చుపై పక్కాగా ఆడిటింగ్​