
ఐపీఎల్ సీజన్ 18 లో మ్యాచ్ లు రసవత్తరంగా జరుగుతున్నాయి. చెన్నై, ముంబై మ్యాచ్ మినహాయిస్తే మిగిలిన మ్యాచ్ ల్లో పరుగుల వరద పారింది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీలో బోణీ కొట్టాయి. నేడు (మార్చి 25) గుజరాత్ టైటాన్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడంతో నేడు మరో కొత్త జట్టు విజయం సాధించనుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో కొన్ని నిర్ణయాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
మెగా ఆక్షన్ లో రూ.10 కోట్లకు పైగా ఖర్చు చేసి కొనుకున్న ప్లేయర్లకు తుది జట్టులో చోటు దక్కపోవడం షాకింగ్ గా మారుతుంది. హార్దిక్ పాండ్య, రాహుల్, బుమ్రా వివిధ కారణాలతో టోర్నీ తొలి మ్యాచ్ కు దూరమయ్యారు. వీరు ఎందుకు తొలి మ్యాచ్ ఆడలేదో అందరికీ తెలిసిందే. అయితే కోట్లు పెట్టి కొనుకున్న ప్లేయర్స్ మాత్రం బెంచ్ కు పరిమితమవుతున్నారు. భువనేశ్వర్ కుమార్, నటరాజన్, పతిరానా ఈ లిస్ట్ లో ఉన్నారు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరుగుతున్న టోర్నీ తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కు చోటు దక్కలేదు. టాస్ తర్వాత ఆర్సీబీ ప్రకటించిన తుది జట్టులో భువికి స్థానం లేకపోవడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఎన్నో అంచనాలు.. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ స్వింగ్ కింగ్ లేకపోవడంతో ఒక్కసారిగా బెంగళూరు ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో భువీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10.75 కోట్లకు దక్కించుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ యువ సంచలనం మతీష పతిరానాకి టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో చోటు దక్కలేదు. మెగా ఆక్షన్ కు ముందు ఈ లంక ఫాస్ట్ బౌలర్ ను చెన్నై రూ.13 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. పతిరానా స్థానంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్ జట్టులోకి వచ్చాడు. పతిరాన తొలి మ్యాచ్ లో ఎందుకు ఆడలేదో ఎలాంటి సమాచారం లేదు. సోమవారం (మార్చి 24) లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్ నటరాజన్ బెంచ్ కే పరితమయ్యాడు. మెగా ఆక్షన్ లో ఈ తమిళ నాడు బౌలర్ ను రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. నటరాజన్ ఎందుకు ఆడలేదో ఢిల్లీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.