
- ఏడాదిలో 43 వేల మంది డౌన్‌లోడ్, 32 వేల రిజిస్ట్రేషన్లు
- మానిటరింగ్ రిక్వెస్ట్ ద్వారా 23 వేల ఎస్‌ఎమ్‌ఎస్ అలర్టులు
- 36,470 రిక్వెస్ట్‌లకు సరైన మార్గాలు సూచించిన యాప్
- 100 డయల్‌లో ఐవీఆర్ ద్వారా '8 'ప్రెస్ చేసినా లొకేషన్ ట్రాక్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళా ప్రయాణికులకు భద్రతగా విమెన్ సేఫ్టీ వింగ్ రూపొందించిన ‘టీ (ట్రావెల్)- సేఫ్’ యాప్ సత్ఫలితాలను ఇస్తోంది. మహిళలు, విద్యార్థినులు తమ ప్రయాణ
సమయాల్లో ఎలాంటి వేధింపులకు గురికాకుండా రక్షణ కల్పిస్తోంది. మానిటరింగ్ రిక్వెస్ట్ ద్వారా ఏడాదిలో 23 వేల ఎస్‌ఎమ్ఎస్ అలర్ట్‌లు పంపించింది. రిప్లే రూపంలో సమాచారం సేకరించింది. ఇలా.. 36,470 మానిటరింగ్ రిక్వెస్ట్‌లకు సరైన మార్గాలను సూచించింది. మహిళలు, విద్యార్థినుల రక్షణకు భరోసా ఇచ్చే విధంగా గతేడాది మార్చి 12న టీ సేఫ్ యాప్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
యాప్ ప్రారంభించిన నాటి నుంచి ఏడాది కాలంలో 43 వేల మంది డౌన్‌లోడ్ చేసుకోగా 32 వేలు యాప్‌లో రిజిస్ట్రేషన్లు జరిగాయి. యాప్ ఆవిష్కరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విమెన్ సేఫ్టీ విగ్ చీఫ్, డీజీ శిఖాగోయల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఓలా, ఉబెర్, ర్యాపిడో, మనయాత్రి, సేఫ్‌గాడీ,అబిబస్ సహా ఇతర ప్రైవేట్ ట్రావెల్స్‌ను టీ సేఫ్‌తో ఇంటిగ్రేటెడ్ చేసినట్లు తెలిపారు.
మహిళల ప్రయాణంలో టీ సేఫ్ ఇలా..
క్యాబ్‌లు, ఆటోలు, బస్సులు, రైల్లు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణం చేస్తున్న మహిళలకు గూగుల్ ప్లే స్టోర్‌లో టీ సేఫ్ యాప్ అందుబాటులో ఉంది. ఒంటరిగా ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ యాప్‌లో వివరాలను నమోదు చేసి మానిటరింగ్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుని రిక్వెస్ట్ పెట్టిన వారి ఫోన్ నంబర్‌కు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఆటోమెటిక్ సేఫ్టీ మెసేజ్ వెళ్తుంది. ఇలా రిసీవ్ చేసుకున్న ఎస్‌ఎమ్‌ఎస్‌కు నాలుగు అంకెల పాస్ కోడ్ పంపించాలి. మెసేజ్‌లకు రిప్లే ఇవ్వని పక్షంలో పోలీసులు అప్రమత్తమవుతారు.
ట్రావెల్ చేసే మార్గం మారినా, మార్గ మధ్యలో ఎక్కువసేపు ఆగినా టీ-సేఫ్ కంట్రోల్ రూం నుంచి డయల్100కు కాల్ వెళ్తుంది. ఆ తరువాత 100 డయల్ సిబ్బంది ద్వారా ప్రయాణికులకు ఫోన్ వెళ్తుంది. ఫోన్ కాల్‌కి స్పందించకపోతే లొకేషన్ ఆధారంగా స్థానిక పోలీసులకు అలర్ట్ మెసేజ్ వెళ్తుంది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటారు. దీంతో పాటు ప్రయాణానికి ముందు 100కు డయల్ చేసి ఐవీఆర్(ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) ద్వారా ‘8’ నంబర్‌ను క్లిక్ చేసి కూడా వివరాలను తెలియజేస్తే సెల్‌టవర్ ఆధారంగా పోలీసులు లొకేషన్ ట్రాక్ చేస్తారు. ఏదైనా సమస్య తలెత్తిందని తెలిస్తే పోలీసులు స్పాట్‌కి వెళ్తారు.