- విద్యార్థులకు డిజిటల్ లెసన్స్ ప్రసారం చేసేందుకు సిద్ధమైన టి-సాట్
- జూన్ 20 నుంచి 30వ తేదీ వరకు విద్య ఛానల్ లో ప్రసారాలు
- తెలుగు, ఇంగ్లీష్, ఉర్డూ భాషల్లో బ్రిడ్జ్ కోర్స్ పాఠ్యాంశాలు
- జూలై మొదటి వారంలో ప్రారంభం కానున్న రెగ్యులర్ పాఠాలు
- సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్ డిజిటల్ పాఠ్యాంశాలు ప్రసారం చేసేందుకు టి-సాట్ సిద్ధమైంది. 2024, జూన్ 20వ తేదీ నుంచి డిజిటల్ పాఠాలు టి-సాట్ విద్య ఛానల్ లో ప్రసారం కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రసారాలు కొనసాగనున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆధునిక సాంకేతికతో కూడిన విద్యను అందించాలనే ఆలోచనలో భాగంగా డిజిటల్ పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నట్లు సీఈవో బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. 2023.. -24 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్రిడ్జి కోర్స్ లో భాగంగా జూన్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు.. ఆదివారం మినహాయించి తొమ్మిది రోజుటు పాఠ్యాంశ ప్రసారాలుంటాయని వివరించారు. 30 నిమిషాల నిడివిగల పాఠ్యాంశాలు ఉదయం 10 గంటలకు మూడో తరగతి విద్యార్థుల నుంచి ప్రారంభమై.. 10వ తరగతి విద్యార్థుల వరకు డిజిటల్ పాఠాలు కొనసాగుతాయని సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
డిజిటల్ లెసన్స్ మ్యాథ్స్, హిందీ, ఇంగ్లీష్, సైన్స్ తో పాటు మిగతా సబ్జెక్ట్ ల్లో రోజుకు మూడు గంటల చొప్పున.. తొమ్మిది రోజులు పాటు 27 గంటలు ప్రసారం కానున్నట్లు వెల్లడించారాయన. మూడు భాషల్లో సిద్ధమైన లెసన్స్ తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలోని సైట్ (స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ) తయారు చేసిన పాఠ్యాంశాల షెడ్యూల్ ఇప్పటికే రాష్ట్రంలోని ఆయా పాఠశాలలకు చేరిందని గుర్తు చేశారు. ఆఫ్ లైన్ లో రెగ్యులర్ గా ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలకు అనుబంధంగా ఈ డిజిటల్ పాఠ్యాంశాల ప్రసారాలు కొనసాగనున్నాయని సీఈవో స్పష్టం చేశారు. జులై మొదటి వారంలో పాఠశాల విద్యాశాఖ అందించే రెగ్యులర్ షెడ్యూల్ పాఠ్యాంశాలకు సంబంధించిన వివరాలను అందించనున్నామని.. విద్యార్థులు-, వారి తల్లిదండ్రులు డిజిటల్ పాఠ్యాంశాల ప్రాధాన్యతను గుర్తించాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు.