ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే ఉపాధ్యాయులుగానే ఉండాలి.. అంతేకానీ ఫ్యాషన్ షోలో ఉన్నట్లు ఉండకూడదు కదా.. అందుకే చెబుతున్నాం.. ప్రభుత్వ టీచర్లు ఎవరూ టీ షర్టులు, జీన్స్ ప్యాంట్స్ వేసుకుని పాఠశాలలకు రావొద్దు.. ఇక నుంచి బ్యాన్ చేస్తున్నాం అంటూ ఆదేశాలు ఇచ్చింది బీహార్ ప్రభుత్వం. స్కూల్ అంటే పద్దతి లేకుండా పోతుందని.. టీచర్లు పద్ధతిగా లేకపోతే ఇక పిల్లలు ఎలా తయారు అవుతారో ఊహించుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చింది బీహార్ సర్కార్.
అన్ని విద్యా సంస్థల్లోనూ టీచర్లు పద్దతిగా దుస్తులు ధరించాలని సూచించింది ప్రభుత్వం. అంతేకాకుండా రీల్స్, షార్ట్స్ చేయటాన్ని సైతం నిషేధించింది. డాన్సులు చేయటం.. డీజేలు చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయటం ద్వారా.. ప్రభుత్వ ఉపాధ్యాయులపై చులకన భావం ఏర్పడుతుందని.. ఇలాంటి వ్యవహారాలను సహించేది లేదని వార్నింగ్ ఇచ్చింది బీహార్ ప్రభుత్వం.
ప్రభుత్వ టీచర్ల ఇలాంటి వ్యవహారాలు విద్యా వ్యవస్థపైనే ప్రతికూల ప్రభావం చూపిస్తాయని.. ప్రభుత్వ స్కూల్స్ గౌరవాన్ని తగ్గిస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ హెచ్చరించింది ప్రభుత్వం.
ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులు అందరూ.. విధులకు హాజరయ్యే సమయంలో టీ షర్టులు, జీన్స్ ప్యాంట్స్ ధరించకూడదని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. పద్దతిగా రెగ్యులర్ దుస్తులు ధరించాలని కూడా సూచించింది.