హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ వీసీ నియామకం కోసం వెంటనే సెర్చ్ కమిటీని నియమించాలని అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్శిటీ టీచర్స్(అకుట్) అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్ టి.శ్రీనివాస్, డా.మామిడాల ఇస్తారి కోరారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ లో బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
కేయూలో విద్యార్థులు, టీచర్లు, నాన్ టీచింగ్ ఉద్యోగుల అనేక దీర్ఘ కాలిక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పరిష్కరించడానికి పూర్తి స్థాయి పాలక మండలిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కేయూ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు అకుట్ బాధ్యులు తెలిపారు.
సీఎం సలహాదారును కలిసి రవీందర్ రెడ్డి..
కాశీబుగ్గ: సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని బుధవారం హైదరాబాద్లో తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ర్ట ప్రెసిండెంట్ బొమ్మినేని రవీందర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలతోపాటు కాటన్ పరిశ్రమలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించినట్లు తెలిపారు.