విశాఖపట్నం: వన్డే వరల్డ్ కప్ ముగిసిన నాలుగు రోజుల్లోనే కొత్త సవాల్‌కు రెడీ అయింది. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి బాధను మరిచిపోయి కొత్త కెప్టెన్, కొత్త ఫార్మాట్‌లో యువ ఆటగాళ్లతో తమ పోరాటాన్ని సరికొత్తగా ఆరంభించనుంది. వరల్డ్ కప్‌లో తమకు గుండెకోతను మిగిల్చిన ఆస్ట్రేలియాతో టీ20ల్లో పోటీ పడనుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం వైజాగ్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్ కెప్టెన్సీలోని ఇండియా శుభారంభమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. తొలిసారి నేషనల్ టీమ్ కెప్టెన్సీ చేపట్టిన సూర్య ఈ సిరీస్‌లో పలువురు నెక్స్ట్ జనరేషన్ ప్లేయర్లను నడిపించబోతున్నాడు. వరల్డ్ కప్‌లో నిరాశ పరిచిన సూర్య తన కిష్టమైన ఫార్మాట్‌లో బ్యాటర్‌గానూ సత్తా చాటాల్సిన అవసరం ఉంది.
.వచ్చే ఏడాది జూన్–జులైలో టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ సిరీస్‌లో పలువురు యువ ప్లేయర్లకు సెలెక్టర్లు చాన్స్ ఇచ్చారు. ఆసీస్‌పై సత్తా చాటితే వారి కాన్ఫిడెన్స్ పెరగనుంది. యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మతో పాటు ముకేశ్ కుమార్ ఇప్పటికే ఇంటర్నేషనల్ డెబ్యూ చేసినప్పటికీ ఇప్పుడు బలమైన ఆసీస్ రూపంలో వారికి అసలైన పరీక్ష ఎదురవనుంది. వరల్డ్ కప్ విన్నర్ ఆసీస్ ఆ టోర్నీలో ఆడిన మెజారిటీ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చింది. అయినావరల్డ్ కప్ హీరోలు ట్రావిస్ హెడ్, మ్యాక్స్‌వెల్, స్పిన్నర్ ఆడమ్ జంపా, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఐపీఎల్‌లో అదరగొట్టిన స్టోయినిస్, నేథన్ ఎల్లిస్, టిమ్ డేవిడ్ వంటి ప్లేయర్లతో బలంగా ఉంది. ఈ టీమ్‌ను సీనియర్ కీపర్-బ్యాటర్ మాథ్యూ వేడ్ నడిపిస్తున్నాడు. కేన్ రిచర్డ్ సన్, ఎల్లిస్, అబాట్, బెరెండార్ఫ్లతో బౌలింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. వరల్డ్ కప్ ఆడి అలసిసోయిన నేపథ్యంలో మ్యాక్సీ, జంపా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం కనిపించడం లేదు.
కుర్రాళ్లకు కీలకం
2022 వరల్డ్ కప్ సెమీస్ ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఈ ఫార్మాట్‌లో ఆడటం లేదు. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో సత్తా చాటే యంగ్‌స్టర్స్‌ను వచ్చే టీ20 వరల్డ్ కప్‌నకు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కుర్రాళ్లలో రింకూ సింగ్, హైదరాబాదీ తిలక్ వర్మ ఆడిన కొన్ని మ్యాచ్‌ల్లోనే అందరినీ మెప్పించారు. యశస్వి జైస్వాల్, ముకేశ్ కూడా ఆకట్టుకున్నారు. అయితే, ఇప్పటిదాకా వెస్టిండీస్, ఐర్లాండ్ వంటి సాధారణ ప్రత్యర్థులు, ఆసియా గేమ్స్‌లో బి గ్రేడ్ టీమ్స్‌ను ఎదుర్కొన్న ఈ యంగ్‌స్టర్స్‌కు ఆసీస్‌తో పాటు సౌతాఫ్రికా టూర్‌లో, సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లు కీలకం కానున్నాయి.
మొత్తంగా ఐపీఎల్‌కు ముందు ఇండియా 11 ఇంటర్నేషనల్ టీ20లు ఆడనుంది. ఆ తర్వాత పూర్తిగా టీ20 వరల్డ్ కప్ మోడ్‌లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ టీమ్‌లో ప్లేస్ ఆశిస్తున్న యంగ్‌స్టర్స్ లైఫ్‌లో రాబోయే రెండు నెలలు అత్యంత కీలకం కానున్నాయి. ఇక, ఈ సిరీస్‌లో కోచ్‌గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ ఇండియా బ్యాటింగ్ లైనప్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి కలిగిస్తోంది. టాపార్డర్‌లో చాలా ఆప్షన్లు కనిపిస్తుండగా రుతురాజ్ గైక్వాడ్‌తో లెఫ్టాండర్లు జైస్వాల్, ఇషాన్ కిషన్‌లో ఒకరు ఇన్నింగ్స్ ఆరంభించే చాన్సుంది. అప్పుడు వన్‌డౌన్‌లో తిలక్ వర్మను ఆడించొచ్చు.
ఒకవేళ మేనేజ్‌మెంట్ జైస్వాల్, ఇషాన్ ఇద్దరినీ ఆడిస్తే తిలక్‌కు తుది జట్టులో ప్లేస్ ఉండకపోవచ్చు. పరిస్థితికి తగ్గట్టుగా కెప్టెన్ సూర్య మూడు లేదా నాలుగో నంబర్‌లో బరిలోకి దిగనున్నాడు. వన్డే టీమ్‌లా కాకుండా టీ20ల్లో జైస్వాల్, ఇషాన్, తిలక్, రింకూ, ఆల్‌రౌండర్లు అక్షర్, దూబే, సుందర్ రూపంలో లెఫ్టాండర్లు ఉన్నారు. ఈ సిరీస్‌లో బౌలర్లకే అతి పెద్ద పరీక్ష ఎదురుకానుంది. చహల్ టీమ్‌కు దూరమైన నేపథ్యంలో లెగ్గీ రవి బిష్ణోయ్‌కు ఎక్కువ అవకాశాలు రానున్నాయి. ప్రసిధ్, అవేశ్, ముకేశ్, అర్ష్‌దీప్‌లను రొటేట్ చేసే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకున్న నేపథ్యంలో ఐదు మ్యాచ్‌లు ఆడే చాన్సుంది.