ఇండియా- పాక్ మ్యాచ్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇరు దేశాల అభిమానులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వాస్తవంగా చెప్పాలంటే.. ఇరు జట్ల ఆటగాళ్లకు ఈ మ్యాచ్ ఒక యుద్ధమే. ఓటమిని ఎవరూ తేలిగ్గా అంగీకరించరు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు భావోద్వేగ ఘటనలు తెరమీదకు వస్తుంటాయి. అలాంటి సమరం ఈ ఏడాది అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా లక్ష మంది నడుమ మరోసారి జరగనుంది. ఈ క్రమంలో గతేడాది జరిగిన ఓ సంఘటనను భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అభిమానులతో పంచుకున్నాడు.
గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా ఆఖరి బంతికి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఓటమి అంచున నిలిచిన భారత జట్టును.. కోహ్లీ తన అసాధారణ బ్యాటింగ్‌తో ఒడ్డుకు చేర్చాడు. క్రికెట్ చరిత్రలోనే ఓ అద్భుతమైన మ్యాచ్‌గా ఇది నిలిచిపోయింది. ఈ మ్యాచులో కోహ్లీ పోరాటం గురుంచి ఎంత గొప్పగా చెప్పుకోవచ్చో.. ఆఖరి బంతికి రెండు పరుగులు కావాల్సిన సమయంలో అశ్విన్ చూపిన చాకచక్యాన్ని అంతే మెచ్చుకోవాలి. అయితే ఆ ఆఖరి బంతి ముందు ఏం జరిగిందో..? కోహ్లీ తనకేం చెప్పాడో..? అశ్విన్ ఇప్పుడు బయటపెట్టాడు.
"విజయానికి రెండు బంతుల్లో రెండు పరుగులు. మాదే గెలుపు అనుకున్నా. కానీ అనూహ్యంగా ఐదో బంతికి దినేశ్ కార్తిక్ ఔటయ్యాక పెద్ద భాధ్యతే నాపై పెట్టాడని అనిపించింది. అతనిపై కోపంతోనే మైదానంలోకి అడుగుపెట్టా. ఆ సమయంలో ప్రేక్షకులు చేసిన.. నాముందు ఎంత పెద్ద బాధ్యత ఉందో గుర్తు చేశాయి. అంతకుముందెన్నడూ నేను అలాంటి వాతావరణాన్ని, మద్దతును చూడలేదు. క్రీజులోకి వెళ్ళగానే కోహ్లీ నా వద్దకు వచ్చాడు. ఆ బంతిని ఎలా ఎదుర్కోవాలో చెప్పేందుకు ఏడు ఆప్షన్లు ఇచ్చాడు. అన్ని షాట్లు ఆడే సామర్థ్యం నాకంటే ఎనిమిదో స్థానంలో ఎందుకు బ్యాటింగ్ చేస్తానా? అని నా మనసులో అనుకున్నా."
"అతను చెప్పినదానికి అంగీకరించాను. కోహ్లీతో ఒక్క మాట మాట్లాడలేదు. కానీ ఆ సమయంలో కోహ్లీ కళ్లలో నాకు ఏదో పవర్ కనిపించింది. వేరే గ్రహం నుంచి వచ్చినవాడిలా కనిపించాడు. నవాజ్ వైడ్ బాల్ వేయగానే ఈ మ్యాచ్ గెలుస్తామన్న నమ్మకం నాలో కలిగింది. నా చేతుల్లో ఈ విజయం రాసిపెట్టుందని అనుకున్నా. రాత్రి పడుకునే ముందు ఈ మ్యాచ్ గురించి అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటా. ఒకవేళ అది వైడ్ బాల్ కాకుంటే.. నా పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే వెన్నులో భయం పడుతుంది. ఏదేమైనా కోహ్లీ ఆడిన ఆ ఇన్నింగ్స్ మాత్రం అసాధారణమైనది.." అని అశ్విన్ వెల్లడించాడు.
The final 5 overs vs Pakistan in 2022 WC.
— SUPRVIRAT (@kohlidrift) June 29, 2023
Part:1/nhttps://t.co/9hdp71uomx
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ పాక్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 159 పరుగులు చేయగా.. భారత జట్టు ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. ఇక వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా ఈ ఇరు జట్లు అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి.