T20 World Cup 2024: ఔటైన బాధలో దురుసు ప్రవర్తన.. న్యూజిలాండ్‌ పేసర్‌కు మందలింపు

T20 World Cup 2024: ఔటైన బాధలో దురుసు ప్రవర్తన.. న్యూజిలాండ్‌ పేసర్‌కు మందలింపు

టీ20 ప్రపంచ కప్‌ 2024లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ లో ఐసీసీ నియమావళిని ఉల్లఘించినందుకు గానూ న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ మందలింపుకు గురయ్యాడు. 

ఈ మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే ఔటైన సౌథీ డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్తూ క్రికెట్ పరికరాలను ధ్వంసం చేశాడు. హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సర్‌ను పగులగొట్టాడు. అతని తప్పును లెవల్ 1గా గుర్తించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) అధికారికంగా మందలించింది. దానితో పాటు, సౌతీ క్రమశిక్షణా రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ జోడించింది. అతనికిది 24 నెలల్లో మొదటి నేరమని ఐసిసి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సౌథీ నేరాన్ని అంగీకరించాడు కనుక తదుపరి విచారణ అవసరం లేదని ఐసీసీ వెల్లడించింది.

ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ నిబంధనల ప్రకారం,​ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో క్రికెట్ పరికరాలు లేదా సామాగ్రిని ధ్వంసం చేస్తే ఆర్టికల్ 2.2 ఉల్లంఘన కింద ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటారు.

ముగిసిన కివీస్ పోరాటం

ఇదిలా ఉంటే, పొట్టి ప్రపంచ కప్‌ 2024 పోరులో న్యూజిలాండ్‌ పోరాటం ముగిసింది. తొలి మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్ చేతిలో ఓడిన కివీస్ జట్టు.. రెండో పోరులో ఆతిథ్య జట్టు వెస్టిండీస్‌ చేతిలో పరాజయం పాలైంది. దీంతో మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే వారు టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఇక శనివారం(జూన్ 15) జరిగిన మ్యాచ్ లో విలియంసన్ సేన.. ఉగాండాపై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.