T20 World Cup 2024: పాకిస్తాన్‌‌కు వరుస షాకులు.. గాయంతో ఆల్‌రౌండర్‌ ఔట్

T20 World Cup 2024: పాకిస్తాన్‌‌కు వరుస షాకులు.. గాయంతో ఆల్‌రౌండర్‌ ఔట్

టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. డబ్బుకు కక్కుర్తిపడి పాక్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేసిన 'మీట్ అండ్ గ్రీట్' ఈవెంట్ ఇప్పటికే ఆ దేశంలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. 25 అమెరికన్ డాలర్ల ఎంట్రీ ఫీజుతో ప్రైవేట్ డిన్నర్ లో పాక్ ఆటగాళ్లను కలిసేలా ఈ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ వివాదంతో తీవ్ర బాధలో ఉన్న పాక్ క్రికెట్ జట్టుకు మరో దెబ్బ తగిలింది. గాయంతో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ వసీం తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. 

టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా పాకిస్తాన్‌ జట్టు.. గురువారం(జూన్‌ 6)న డల్లాస్‌ వేదికగా యూనైటడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా(USA)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ఇమాద్‌ వసీం దూరం కానున్నట్లు పాక్ క్రికెట్ ప్రకటించింది. పీసీబీ మెడికల్ టీమ్ విశ్రాంతి తీసుకోవాలని సూచించినందున వసీం గురువారం జరిగే మ్యాచ్‌కు ఎంపికకు అందుబాటులో ఉండడని తెలిపింది. వసీం ప్రస్తుతం ప్రక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. అతను కోలుకోవడానికి దాదాపు వారం రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం సైతం ధృవీకరించాడు. కాగా, ఇమాద్‌ వసీం రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పాకిస్తాన్‌ తరపున రీఎంట్రీ ఇచ్చాడు.

టీ20 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టు:

బాబర్ ఆజం(కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్(వికెట్ కీపర్), ఫఖర్ జమాన్ , హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్ , మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్ , షాహీన్ షా అఫ్రిది.