- రాణించిన బెయిర్‌స్టో, బట్లర్
గ్రాస్ ఐలెట్ (సెయింట్ లూసియా): టీ20 వరల్డ్ కప్ లీగ్ దశలో ఓ మోస్తరుగా ఆడిన ఇంగ్లండ్‌కు సూపర్–8లో అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (47 బాల్స్‌లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 87 నాటౌట్), బెయిర్‌స్టో (26 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48 నాటౌట్) దంచికొట్టడంతో.. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. టాస్ ఓడిన విండీస్ 20 ఓవర్లలో 180/4 స్కోరు చేసింది.
జాన్సన్ చార్లెస్ (38) టాప్ స్కోరర్. తర్వాత ఇంగ్లండ్ 17.3 ఓవర్లలో 181/2 స్కోరు చేసి గెలిచింది. ఛేజింగ్‌లో జోస్ బట్లర్ (25) నెమ్మదిగా ఆడినా.. సాల్ట్ ఆరంభం నుంచే విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 7 రన్స్ వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌ను పూరన్ డ్రాప్ చేసి మూల్యం చెల్లించాడు. దీంతో ఈ ఇద్దరు పవర్‌ప్లేలో 54/0 స్కోరు చేసింది. అయితే నిలకడగా ఆడుతున్న ఈ జోడీని 8వ ఓవర్‌లో ఛేజ్ (1/19) విడగొట్టాడు.
స్ట్రెయిట్ బాల్‌తో బట్లర్‌ను ఎల్బీ చేసి తొలి వికెట్‌కు 67 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను ముగించాడు. 10 ఓవర్లలో ఇంగ్లండ్ 83/1 స్కోరుతో మంచి స్థితిలో నిలిచింది. కానీ 11వ ఓవర్‌లో రసెల్ (1/21).. మొయిన్ అలీ (13)ని వెనక్కి పంపాడు. 15 బాల్స్ తేడాలో రెండు వికెట్లు పడటంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కొద్దిగా తడబడినట్లు కనిపించింది. అయితే సాల్ట్‌తో కలిసి బెయిర్‌స్టో బ్యాట్ ఝుళిపించాడు. ఇద్దరు కలిసి వరుసగా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు.
16వ ఓవర్‌లో సాల్ట్ మూడు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 30 రన్స్ దంచాడు. బెయిర్‌స్టోతో కలిసి మూడో వికెట్‌కు 44 బాల్స్‌లోనే 97 రన్స్ జోడించి ఇంగ్లండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. సాల్ట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
చార్లెస్ మినహా..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్‌ను ఇంగ్లండ్ బౌలర్లు ఇన్నింగ్స్ మధ్యలో బాగా కట్టడి చేశారు. చార్లెస్, బ్రెండన్ కింగ్ (23) ఐదు ఓవర్లలోనే 40 రన్స్ చేసి మంచి ఆరంభాన్నిచ్చారు. కానీ ఇదే ఓవర్‌లో కింగ్ రిటైర్డ్ హర్ట్ కావడంతో ఇంగ్లీష్ బౌలర్లు పట్టు బిగించారు. 8వ ఓవర్‌లో పూరన్ (36) తొలి సిక్స్‌తో టచ్‌లోకి రావడంతో పవర్‌ప్లేలో 54/0 స్కోరు చేసిన కరీబియన్లు ఫస్ట్ టెన్‌లో 82/0తో నిలిచారు.
అయితే 12వ ఓవర్‌లో మొయిన్ అలీ (1/15)... చార్లెస్‌ను ఔట్ చేసి తొలి వికెట్‌కు 94 రన్స్ భాగస్వామ్యాన్ని ముగించాడు. పావెల్ (36) వచ్చీ రావడంతోనే అటాకింగ్‌కు దిగాడు. రషీద్ (1/21) బౌలింగ్‌లో ఓ సిక్స్, లివింగ్‌స్టోన్ వేసిన15వ ఓవర్‌లో మూడు సిక్స్‌లతో 20 రన్స్ దంచాడు. కానీ ఇదే ఓవర్ లాస్ట్ బాల్‌కు అతను ఔట్ కావడంతో రెండో వికెట్‌కు 43 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. వరుస విరామాల్లో పూరన్, రసెల్ (1) కూడా ఔటైనా, చివర్లో రూథర్‌ఫోర్డ్ (28 నాటౌట్), షెఫర్డ్ (5 నాటౌట్) 37 రన్స్ జోడించారు.