USA vs ENG: బట్లర్ విధ్వంసం.. సెమీస్‍కు అర్హత సాధించిన ఇంగ్లాండ్

USA vs ENG: బట్లర్ విధ్వంసం.. సెమీస్‍కు అర్హత సాధించిన ఇంగ్లాండ్

టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆదివారం(జూన్ 23) అమెరికాతో జరిగిన తమ సూపర్-8 ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికన్లు 115 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని ఇంగ్లీష్ ఓపెనర్లు జోస్ బట్లర్(83*), ఫిల్ సాల్ట్(25*) 9.4 ఓవర్లలో చేధించారు.

బట్లర్ విధ్వంసం

116 పరుగుల స్వల్ప ఛేదనలో ఇంగ్లీష్ ఓపెనర్ జోస్ బట్లర్(83*; 38 బంతుల్లో) వీరవిహారం చేశాడు. పసికూన జట్టు బౌలర్ల పట్ల కనికరం అన్నదే చూపలేదు. ఆదిలో ఆచి తూచి ఆడినా.. ఆఖరిలో పెను విధ్వంసం సృష్టించాడు. హర్మీత్ సింగ్  వేసిన తొమ్మిదో ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాదాడు. వైడ్‌తో కలిపి ఆ ఓవర్‌లో ఏకంగా 32 పరుగులొచ్చాయి. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 6 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో 83 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్(25*; 21 బంతుల్లో) పరుగులతో రాణించాడు.

జోర్డాన్ హ్యాట్రిక్

అంతకుముందు క‌రీబియ‌న్ గ‌డ్డ‌పై ఇంగ్లండ్ పేస‌ర్ క్రిస్ జోర్డాన్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగడంతో అమెరికా స్వల్ప స్కోర్‌కే ప‌రిమిత‌మైంది. 18.5 ఓవర్లలో 115 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. నితీశ్ కుమార్(30), కొరే అండ‌ర్సన్(29), హ‌ర్మీత్ సింగ్(21) పర్వాలేదనిపించారు.

మరో జట్టేది..?

గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్ సెమీస్ చేరడంతో.. మరో జట్టు ఏదన్నది సోమవారం(జూన్ 24) ఉదయం వెస్టిండీస్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్‌తో స్పష్టత రానుంది. ఆ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు గ్రూప్-2 నుంచి రెండో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోనుంది.