T20 World Cup 2024: మారిన సెమీస్ లెక్కలు.. అదే జరిగితే టీమిండియా టోర్నీ నుండి ఔట్!

T20 World Cup 2024: మారిన సెమీస్ లెక్కలు.. అదే జరిగితే టీమిండియా టోర్నీ నుండి ఔట్!

ఆస్ట్రేలియాపై అఫ్గన్‌ విజయంతో టీ20 ప్రపంచకప్‌ సెమీస్ రేసు ఆసక్తికరంగా మారిపోయింది. గ్రూప్-1లో నాలుగు జట్లకు సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి. ఆడిన రెండింటిలో విజయం సాధించిన ఇండియా కాస్త మెరుగైన స్థితిలో ఉంటే.. రెండుకు రెండు బంగ్లాదేశ్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. వీటిలో ఏ జట్టు ముందుకెళ్తదో.. ఏ జట్టు ఇక్కడితో సరిపెట్టుకుంటదో తెలియని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రూప్‌ 1 నుంచి ఏయే జట్లకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చూద్దాం..

గెలిస్తే సగర్వంగా సెమీస్‌

సూపర్‌ 8లో వరుసగా రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించిన టీమిండియా దాదాపు సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. అయితే, అధికారికంగా కాదు. రోహిత్ సేన చివరి మ్యాచ్‌లో జూన్‌24న ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఇందులో విజయం సాధిస్తే సగర్వంగా సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో స్వల్ప తేడాతో ఓడినా వచ్చిన నష్టం లేదు. మెరుగైన రన్‌రేట్‌ కారణంగా సెమీస్ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అలా కాకుండా, ఆసీస్ చేతిలో 41 పరుగుల తేడాతో ఓడితే, కంగారూల జట్టు.. టీమిండియా రన్‌రేట్‌‌ను అధిగమించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. మరో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌.. బంగ్లాదేశ్‌‌ను 81 పరుగుల తేడాతో ఓడించినట్లయితే భారత్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించినట్లే. ఈ లెక్కలు దాదాపు అసంభవం అయినప్పటికీ.. కొట్టి పారేయలేం.

ఆస్ట్రేలియా పరిస్థితి తారు మారు

ఆఫ్గనిస్తాన్ చేతిలో ఓటమితో ఆస్ట్రేలియా పరిస్థితి తారుమారైంది. ఒక్క ఓటమి ఆ జట్టు సెమీస్‌ అవకాశాలను బాగా దెబ్బ తీసింది. ఆడిన రెండింట్లో ఒకే విజయాన్ని నమోదు చేసిన ఆ జట్టు.. తన చివరి మ్యాచ్‌లో భారత్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఓడినా.. ఆఫ్ఘన్ తో జరిగే మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధిస్తే అప్పుడు మూడు జట్ల మధ్య రన్‌రేట్‌ కీలకమవుతుంది. 

రేసులో ఆఫ్ఘన్లు

పొట్టి ప్రపంచకప్ ఆశలు వదులుకున్నట్లు కనిపించిన అఫ్గన్లు.. ఆస్ట్రేలియాపై విజయంతో ఒక్కసారిగా సెమీస్‌ రేసులోకి వచ్చారు. బంగ్లాదేశ్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో వారు తప్పక విజయం సాధించాలి. అదే సమయంలో భారత్‌ చేతిలో ఆసీస్‌ ఓడితే అఫ్గాన్‌ నేరుగా సెమీస్‌కు చేరుతుంది.

ఒకవేళ ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్ తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోతే.. ఒక్కో విజయం సాధించిన జట్లు మూడవుతాయి. అప్పుడు బంగ్లాదేశ్‌కు కూడా సెమీస్ అవకాశాలు ఉంటాయి. ఈ మూడింట్లో మెరుగైన రన్‌ రేట్‌ ఉన్న జట్టు.. భారత్‌తోపాటు సెమీస్‌ చేరుతుంది.