T20 World Cup 2024: కెనడాతో నామమాత్రపు మ్యాచ్.. భారీ మార్పులతో బరిలోకి రోహిత్ సేన!

T20 World Cup 2024: కెనడాతో నామమాత్రపు మ్యాచ్.. భారీ మార్పులతో బరిలోకి రోహిత్ సేన!

ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ జట్టు వరుస విజయాలు సాధిస్తున్న విషయం విదితమే. తొలిపోరులో ఐర్లాండ్‌పై శుభారంభం చేసిన రోహిత్ సేన.. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. అనంతరం ఆతిథ్య జట్టు అమెరికాను మట్టికరిపించి హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్‌-8కు అర్హత సాధించింది. ఇప్పుడు కీలకమైన సూపర్‌-8కు ముందు పసికూన కెనడాతో భారత్‌ తలపడనుంది. శనివారం( జూన్ 15) సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం(లాడర్‌హిల్, ఫ్లోరిడా) వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నామమాత్రపు పోరులో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. 

ఓపెనర్‌గా జైస్వాల్

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఓపెనర్‌గా కోహ్లీ పరుగుల వరద పారించాడు. 15 మ్యాచ్‌ల్లో 741 పరుగులు చేశాడు. దీంతో టీమ్ మేనేజ్‌మెంట్.. రెగ్యులర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను పక్కనపెట్టి రోహిత్, కోహ్లీల ఓపెనింగ్ కాంబినేషన్‌తో ముందుకు సాగింది. అయితే, ఆ వ్యూహం ఫలించలేదు. మెగా టోర్నీలో కోహ్లీ ఇంకా రెండంకెల స్కోరు నమోదు చేయలేదు. ఆడిన 3 మ్యాచ్‌ల్లో మొత్తంగా 5 పరుగులు చేశాడు. దీంతో యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా దించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

జడేజా స్థానంలో కుల్దీప్

మెగా టోర్నీలో రవీంద్ర జడేజా ప్రదర్శన అంతంత మాత్రమే. ఈ లెఫ్ట్ ఆర్మ్ ఆల్‌రౌండర్ జట్టులో ఉన్నారన్న పేరు తప్ప.. రాణించింది లేదు. ఐర్లాండ్‌, పాకిస్థాన్‌తో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఏ ఒక్క బ్యాటర్‌ను ఔట్ చేయలేకపోయిన జడేజా.. యూఎస్‌ఏతో జరిగిన చివరి మ్యాచ్‌లో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. అందునా, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ ద్వయం ఫామ్‌లో ఉండటంతో ఇతర బౌలర్లపై భారమూ పడలేదు. కానీ, కెనడాతో పోరు అనంతరం కీలకమైన సూపర్-8 దశ ప్రారంభం కానుంది. అంతకంటే ముందు టీమిండియా బౌలింగ్ లైనప్ మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో జడేజాను తప్పించి  కుల్దీప్ ను పరీక్షించే అవకాశమూ లేకపోలేదు. 

 బుమ్రాకు విశ్రాంతి..!

మరోవైపు, కెనడాతో పోరులో ప్రధాన పేసర్ బుమ్రాకు విశ్రాంతినివ్వొచ్చన్న నివేదికలు వస్తున్నాయి. ప్రతి మ్యాచ్‌లోనూ ఈ రైట్ ఆర్మ్ పేసర్ పై అధిక భారం పడుతోంది. వికెట్లు తీయాలన్నా.. పరుగులు కట్టడి చేయాలన్నా.. బుమ్రాపైనే ఆధారపడుతున్నారు. కెనడాతో నామమాత్రపు మ్యాచ్ కనుక అతనికి విశ్రాంతినివ్వడం ఖాయమన్న మాటలు వినపడుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే సిరాజ్, అర్షదీప్ ఇద్దరే ప్రధాన పేసర్లు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వీరికి సహాయపడనున్నాడు.

భారత జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.