కెనడాతో జరగాల్సిన టీమిండియా చివరి లీగ్ మ్యాచ్ తడి ఔట్‌ఫీల్డ్ కారణంగా రద్దయ్యింది. ఫ్లొరిడాలో భారీ వర్షాల కారణంగా సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ స్టేడియం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దీంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యపడకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. ఈ నిర్ణయం మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన అభిమానులకు నిరాశ కలిగించింది.
మైదానాన్ని సిద్ధం చేయడానికి గ్రౌండ్స్‌మెన్ శాయశక్తులా ప్రయత్నించారు. తడిగా ఉన్న ప్రాంతాలను పెద్ద పెద్ద మెషిన్ల సాయంతో ఆరబెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, ప్రయోజనం లేకపోయింది. ఔట్‌ఫీల్డ్‌లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో అంపైర్లకు ఆటను రద్దు చేయడం తప్ప మరో దారి కనిపించలేదు. మ్యాచ్ రద్దవ్వడంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. దాంతో, రోహిత్ సేన ఏడు పాయింట్లతో గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలవగా.. మూడు పాయింట్లు సాధించిన కెనడా మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
వెస్టిండీస్ పయనం
ఇప్పటికే సూపర్ -8 దశకు అర్హత సాధించిన భారత జట్టు తదుపరి మ్యాచ్‌ల కోసం వెస్టిండీస్ పయనం కానుంది.
టీమిండియా సూపర్ 8 మ్యాచ్‌ల షెడ్యూల్
- జూన్ 20: భారత్ vs అఫ్గానిస్థాన్- బార్బడోస్ (రాత్రి 8 గంటలకు)
- జూన్ 22: భారత్ vs బంగ్లాదేశ్/ నెదర్లాండ్స్- ఆంటిగ్వా (రాత్రి 8 గంటలకు)
- జూన్ 24: భారత్ vs ఆస్ట్రేలియా- లూసియా (రాత్రి 8 గంటలకు)