ఐపీఎల్, బీబీఎల్, పీఎస్‌ఎల్, ఎల్‌పీఎల్.. ఇలా పదుల కొద్దీ లీగ్‌లతో టీ20 క్రికెట్ కొత్త శిఖరాలకు చేరుతున్నా.. టీ20 వరల్డ్ కప్‌కు ఉండే మజానే వేరు..! ఇంటర్నేషనల్ స్టార్లు తమ దేశ జెర్సీ, జెండాతో బరిలోకి దిగి .. స్టేడియంలో కొదమసింహాల్లా కొట్లాడుతుంటే వచ్చే కిక్కే వేరు..! రెండేండ్లకోసారి టీ20 ఫార్మాట్‌లోని అసలైన మజాను అందించే టీ20 వరల్డ్ కప్ తొమ్మిదో ఎడిషన్ సరికొత్తగా ముస్తాబై వచ్చింది..! రికార్డు స్థాయిలో 20 జట్లు బరిలోకి దిగుతున్న మెగా ఈవెంట్‌కు తొలిసారి యూఎస్‌ఏ కూడా ఆతిథ్యం ఇవ్వనుంది.
విండీస్ దీవులతో పాటు బేస్‌బాల్ అడ్డా అయినా అగ్రరాజ్యం గడ్డపై తొలిసారి క్రికెట్ బాల్ సందండి చేయనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక వంటి మేటి జట్లు కప్పు కోసం కదం తొక్కేందుకు సిద్ధమవగా.. యూఎస్‌ఏ, కెనడా,పపువా న్యూగినియా, ఉగాండా వంటి చిరు జట్లూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ చిన్న కప్పు ఎవరికి చిక్కినా.. ఈ రోజు మొదలు.. ఈ నెలంతా క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్కే.. కిక్కు!
గ్రూప్-ఎ: కెనడా, ఇండియా, ఐర్లాండ్, పాకిస్తాన్, యూఎస్‌ఏ
గ్రూప్-బి: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, నమీబియా, ఒమన్, స్కాట్లాండ్
గ్రూప్-సి:అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్, పపువా న్యూగినియా, ఉగాండా, వెస్టిండీస్
గ్రూప్-డి: బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, శ్రీలంక.