T20 World Cup 2024: ఆటగాళ్లను చంపేస్తారా..! న్యూయార్క్‌ పిచ్‌లపై మాజీల ఆగ్రహం

T20 World Cup 2024: ఆటగాళ్లను చంపేస్తారా..! న్యూయార్క్‌ పిచ్‌లపై మాజీల ఆగ్రహం

బుధవారం(జూన్ 05) భారత్- ఐర్లాండ్‌ మ్యాచ్ జరిగిన న్యూయార్క్, నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం పిచ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  బంతి బ్యాటర్లకు సహకరించకపోవడం పక్కనపెడితే, ఇరు జట్ల ఆటగాళ్లు గాయపడటం అందుకు ప్రధాన కారణం. ఇలాంటి పిచ్‌లు ఏ మాత్రం ఆమోదయోగ్యం కావని మాజీలు వాపోస్తున్నారు. కాదని కొనసాగిస్తే ఆటగాళ్లు తీవ్ర గాయాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఏం జరిగిందంటే..?

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐరిష్ బ్యాటర్లు చాలా మందకొడిగా బ్యాటింగ్ చేశారు. బంతి ఆగి రావడం, అనూహ్యమైన బౌన్స్‌తో తెగ ఇబ్బంది పెట్టదాంతో వారి వద్ద సమాధానమే లేకపోయింది. పడిన ప్రాంతాన్ని బట్టి బంతి ఎటు దూసుకెళ్తుందో తెలియని పరిస్థితి. దీంతో ఐరిష్ బ్యాటర్లు క్రీజులో ఉండటం కన్నా.. ఔట్ అవ్వడం మంచిదన్నట్లుగా బ్యాటింగ్ చేశారు. అప్పటికే హ్యారి టెక్టర్, లోక్రాన్ టక్కర్‌లకు గాయాలయ్యాయి. ఛేదనలో భారత బ్యాటర్లు అలానే ఇబ్బంది పడ్డారు. బంతి వేగంగా తగలడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. రిషబ్ పంత్ సైతం గాయపడ్డాడు. దీంతో హై-ప్రొఫైల్ మ్యాచ్‌లకు ఇవి సరైన వేదికలు కావన్న విమర్శలు వస్తున్నాయి.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 96 పరుగులకు కుప్పకూలగా.. ఆ లక్ష్యాన్ని భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 12.2 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ(37 బంతుల్లో 52 రిటైర్డ్ హర్ట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ సాధించాడు.