ఆట ఏదైనా భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. దాయాది జట్టును ఓడించడంలో వచ్చే ఆ మజానే వేరు. అయితే, ఇటీవల భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో చిరకాల ప్రత్యర్థుల పోరు అభిమానులకు ఎలాంటి మజా అందించలేదు. పాక్ ఆటగాళ్లు చేతులెత్తేయడంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు నిరుత్సాహ పడ్డారు. మళ్లీ ఈ ఇరు జట్లు ఎప్పుడు తలపడతాయా అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారందరికి గుడ్ న్యూస్ అందుతోంది. వచ్చే ఏడాది భారత్ - పాక్ మరోసారి తలపడనున్నాయి.
వచ్చే ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనుండగా.. ఇప్పటికే ఈ టోర్నీ షెడ్యూల్ ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ పొట్టి ప్రపంచకప్‌లో భారత్ - పాకిస్తాన్ లీగ్ దశలో తలపడనున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌కు అమెరికాలోని న్యూయార్క్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుందట. న్యూయార్క్‌లో ఇండియా, పాకిస్థాన్ దేశాలకు చెందిన వారు దాదాపు ఎనిమిది లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో న్యూయార్క్ వేదికగా మ్యాచ్ నిర్వహిస్తే స్టేడియం ఫుల్ అయ్యే అవకాశం ఉండటంతో నిర్వాహకులు ఆ దిశగా ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
INDIA VS PAKISTAN WILL BE PLAYED IN NEW YORK CITY IN THE 2024 T20 WORLD CUP....!!! (The Guardian). pic.twitter.com/RbqrkYD2lj
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 15, 2023
టైటిల్ వేటలో 20 జట్లు
ఈసారి టీ20 వప్రపంచ కప్‌లో మొత్తం 20 దేశాలు తలపడబోతున్నాయి. ఉగాండా, పపువా న్యూ గినియా వంటి చిన్న జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
టీ20 వప్రపంచ కప్‌లో పోటీ పడే 20 జట్లు: ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, కెనడా, ఐర్లాండ్, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, ఒమన్, పపువా న్యూగినియా, స్కాట్లాండ్, ఉగాండా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.