T20 World Cup 2024: ఫైనల్ చేరేదెవరు..? సెమీ -ఫైనల్ షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

T20 World Cup 2024: ఫైనల్ చేరేదెవరు..? సెమీ -ఫైనల్ షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

గత నెల రోజులుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోన్నటీ20 ప్రపంచకప్‌ ముగింపు దశకు చేరుకుంది. 20 జట్లతో మొదలైన ఈ టోర్నీలో చివరకు నాలుగు జట్లు మిగిలాయి. అఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, భారత్, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లు గురువారం(జూన్ 27) జరగనున్నాయి. తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికా- అఫ్ఘనిస్తాన్ తలపడనుండగా.. రెండో సెమీస్‌లో భారత్- ఇంగ్లాండ్‌ ఢీకొనబోతున్నాయి.

  • సెమీ-ఫైనల్ 1: దక్షిణాఫ్రికా vs అఫ్ఘనిస్తాన్ (బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ, ట్రినిడాడ్)
  • సెమీ-ఫైనల్ 2: ఇండియా vs ఇంగ్లాండ్‌ (ప్రొవిడెన్స్ స్టేడియం, గయానా)

మ్యాచ్ సమయాలు

భారత కాలమానం ప్రకారం, గురువారం ఉదయం 6 గంటలకు దక్షిణాఫ్రికా- అఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ షురూ కానుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు భారత్‌- ఇంగ్లాండ్‌ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ ప్రారంభం కానుంది.

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

టీ20 ప్రపంచ కప్ 2024 సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారాలు కానున్నాయి. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 HD, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ HD వంటి ఇతర భాషల స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లలో లైవ్ వీక్షించవచ్చు. డిజిటల్‌గా  డిస్నీ+ హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ ఆస్వాదించవచ్చు. హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఉచితం.

ఫైనల్ చేరేదెవరు..?

మెగా టోర్నీలో సంచలన ప్రదర్శనతో సెమీస్‌ చేరిన ఆఫ్ఘన్ జట్టు.. బలమైన దక్షిణాఫ్రికాను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. బలాబలాల్లో సఫారీ జట్టుది పైచేయి అయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్ఘన్లను ఎంతమాత్రం తక్కువ అంచనా వేయలేం. ఈ పోరు హోరాహోరీగానే సాగుతుందని అంచనా. రెండు జట్లలో ఏది గెలిచినా తొలిసారి ఫైనల్‌ చేరుతుంది.

మరో మ్యాచ్‌లో భారత్- ఇంగ్లాండ్ రూపంలో రెండు అగ్రశ్రేణి జట్లు తలపడుతున్నాయి. ఈ ఇరు జట్లు 2022 టీ0 ప్రపంచకప్ సెమీ-ఫైనల్లో తలపడగా.. ఇంగ్లీష్ జట్టు 10 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఇప్పుడు అందుకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం రోహిత్ సేన ముందుంది. బలాబలాల పరంగా ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ఇంగ్లాండ్.. పేస్‌ను నమ్ముకుంటే.. టీమిండియా స్పిన్నర్లపై ఆశలు పెట్టుకొంది.