USA vs IRE: అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ రద్దు.. వరల్డ్ కప్ నుండి పాకిస్థాన్ ఔట్

USA vs IRE: అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ రద్దు.. వరల్డ్ కప్ నుండి పాకిస్థాన్ ఔట్

టీ20 ప్రపంచకప్ 2024లో దాయాది పాకిస్థాన్ జట్టు పోరాటం ముగిసింది. శుక్రవారం(జూన్ 14) ఆతిథ్య జట్టు అమెరికా, ఐర్లాండ్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో.. పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు. లీగ్ దశలో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న అమెరికా జట్టు తొలిసారి సూపర్ -8కు అర్హత సాధించింది. 

గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో అమెరికా, ఐర్లాండ్‌ మ్యాచ్ జరగాల్సిన సెంట్రల్ బ్రోవార్డ్ స్టేడియం(ఫ్లోరిడా) మైదానం చిత్తడిగా తయారయ్యింది. వర్షపు నీరు ఎక్కువ సేపు నిల్వ ఉండటం వల్ల అవుట్‌ఫీల్డ్ బాగా దెబ్బతింది. సిబ్బంది చిత్తడిగా ఉన్న ప్రదేశాలను మెషిన్ల సాయంతో ఆరబెట్టినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అందునా, మరికొన్ని నిమిషాల్లో ఆట ప్రారంభం కానుంది అన్న సమయాన వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యపడకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు.

సూపర్-8కు అమెరికా.. ఇంటికి పాక్

మ్యాచ్ రద్దవ్వడంతో అమెరికా ఖాతాలో ఒక్క పాయింట్ చేరింది. దీంతో 5 పాయింట్లతో లీగ్ స్టేజ్‌ను ముగించి సూపర్-8కి అర్హత సాధించింది. చివరి మ్యాచ్‌లో పాకిస్తాన్.. ఐర్లాండ్(జూన్ 16)తో తలపడనుంది. అందులో గెలిచినా.. వారి ఖాతాలో 4 పాయింట్లు మాత్రమే చేరతాయి. దీంతో దాయాది జట్టు పోరాటం లీగ్ దశలోనే ముగిసింది.

6 జట్లు అర్హత

ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, అమెరికా జట్లు అధికారికంగా సూపర్ 8కు అర్హత సాధించాయి. ఇక ఒమన్, నమీబియా, శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. మరో రెండు జట్లు బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ డేంజర్ జోన్‌లో ఉన్నాయి.