టీ20 ప్రపంచకప్ 2024లో నేడు(జూన్ 14) కీలక మ్యాచ్ జరగనుంది. సంచలన ప్రదర్శన కనబరుస్తోన్న ఆతిథ్య జట్టు అమెరికా.. ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఈ ఇరు దేశాల అభిమానులతో పాటు పాకిస్థాన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫ్లోరిడా వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో అమెరికా గెలిచినా, మ్యాచ్ రద్దయినా.. పాకిస్తాన్ కథ ముగిసినట్టే. దీంతో ఈ పోరుపై ప్రపంచమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది.
చిత్తడిగా మైదానం
గత నాలుగు రోజులుగా ఫ్లోరిడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లాడర్‌హిల్‌లోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం సైతం నీట మునిగింది. ప్రస్తుతానికి వర్షం తగ్గినా.. వర్షపు నీరు ఎక్కువ సేపు నిల్వ ఉండటం వల్ల అవుట్‌ఫీల్డ్ చిత్తడి చిత్తడిగా తయారయ్యింది. దీంతో మ్యాచ్ ఆలస్యం అవుతోంది. అంపైర్లు ఎప్పటికప్పుడు మైదానాన్ని తనిఖీ చేస్తున్నా.. గుడ్ న్యూస్ మాత్రం చెప్పడం లేదు. మైదాన సిబ్బంది చిత్తడిగా ఉన్న ప్రదేశాలను మెషిన్ల సాయంతో ఆరపెడుతున్నారు. మరోసారి వర్షం అంతరాయం కలిగించకపోతే, మరో గంటలో టాస్ వేసే అవకాశాలు ఉన్నాయి.
Certain country dream this machine. #USAvsIRE pic.twitter.com/bi8gV6fGF6
— Nawaz 🇵🇰 (@Rnawaz31888) June 14, 2024
తుది జట్లు(అంచనా)
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, బెంజమిన్ వైట్, జోష్ లిటిల్, మార్క్ అడైర్, గారెత్ డెలానీ, బారీ మెక్‌కార్తీ.
అమెరికా: మోనాంక్ పటేల్ (కెప్టెన్/వికెట్ కీపర్), స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, కోరీ అండర్సన్, నితీష్ కుమార్, జస్దీప్ సింగ్, హర్మీత్ సింగ్, వాన్ షాల్క్‌విక్, సౌరభ్ నేత్రావల్కర్, అలీ ఖాన్.