(వెలుగు స్పోర్ట్స్ డెస్క్) : ఐపీఎల్‌తో టీ20 క్రికెట్ రూపురేఖలు మారాయి. ఈ లీగ్‌తో ఇండియాలో టాలెంటెడ్ ప్లేయర్లు వెలుగులోకి వచ్చి స్టార్లుగా మారుతున్నారు. కానీ, ఈ సక్సెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ టీమ్‌కు అందడం లేదు. పుష్కర కాలంగా ఐసీసీ మెగా టోర్నీల్లో టీమిండియాకు ఏదీ కలిసిరావడం లేదు. ఐపీఎల్‌తో షార్ట్ ఫార్మాట్‌నే కాకుండా క్రికెట్ భవితవ్యమే మారినప్పటికీ టీ20 వరల్డ్ కప్‌లో రెండోసారి విజేతగా నిలవాలని ఆశిస్తున్న టీమిండియా ఒకటిన్నర దశాబ్ద కాలంగా పోరాడుతూనే ఉంది. అప్పుడెప్పుడో 2007లో ధోనీ కెప్టెన్సీలో నెగ్గిన చిట్టి కప్పును ఇంకోసారి అందుకోవడమే టార్గెట్‌గా తొమ్మిదోసారి బరిలోకి దిగుతోంది.
యూఎస్‌ఏ, వెస్టిండీస్ వేదికగా ఆదివారం (ఇండియా టైమ్ ప్రకారం) మొదలయ్యే తాజా ఎడిషన్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కొన్ని మార్పులు మినహా 2022 టోర్నీలోని మెజారిటీ ప్లేయర్లే జట్టులో ఉన్నారు. పాకిస్తాన్‌తో కూడిన గ్రూప్–ఎలో ఉన్న ఇండియా ఈ నెల 5న ఐర్లాండ్‌తో తన పోరు ఆరంభిస్తుంది. యూఎస్‌ఏలో తొలి రౌండ్‌ను దాటడం లాంఛనమే అయినా.. విండీస్ గడ్డపై సూపర్8లోనే ఇండియాకు అసలు సవాల్ ఎదురవనుంది.
ఐపీఎల్ లీగ్ మొదలైనప్పటి నుంచి టీమిండియా టీ20 వరల్డ్ కప్ నెగ్గింది లేదు. సౌతాఫ్రికాలో జరిగిన తొలి ఎడిషన్‌లో సక్సెస్ తర్వాత ఇండియా 2014లో ఒక్కసారి మాత్రమే ఫైనల్ చేరి రన్నరప్‌తో సరిపెట్టింది. ఇక, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత గత 11 ఏండ్లలో మన టీమ్ మరో ఐసీసీ కప్పు నెగ్గలేకపోయింది. గతేడాది ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరి ఆశలు రేపినా.. రెండింటిలోనూ ఆస్ట్రేలియా చేతిలో ఓడటంతో సగటు అభిమానిని తీవ్ర నిర్వేదానికి గురి చేసింది. దాంతో ఈ టోర్నీలో అయినా ఇండియా కప్పు నెగ్గాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఆఖర్లో అదరగొడతారా?
ఈ టోర్నీలో టీమిండియా సూపర్ స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై ఎక్కువ ఫోకస్ ఉండనుంది. ఏజ్ దృష్ట్యా ఈ ఇద్దరికీ ఇదే చివరి టీ20 కప్ అయ్యే అవకాశం ఉంది. అయితే, గత టోర్నీ సెమీఫైనల్లో ఓటమి తర్వాత కోహ్లీ, రోహిత్ ఈ ఏడాది జవనరి వరకూ ఈ ఫార్మాట్‌లో బరిలోకి దిగలేదు. సాధారణంగా టీ20 వరల్డ్ కప్‌నకు 18 నెలల ముందే ప్లానింగ్ మొదలవుతుంది.
కానీ, ఈసారి టోర్నీకి ఏడు నెలల ముందు మాత్రమే కీలక ప్లేయర్లు, సెలెక్టర్లు, కోచ్‌లు ఒక్కచోటుకు వచ్చారు. కుర్రాళ్లకు చాన్స్ ఇస్తారని భావించినా రోహిత్, కోహ్లీ చివరిసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. వీళ్ల అనుభవం జట్టుకు లాభమే అయినా.. ఇద్దరి స్ట్రయిక్ రేట్‌పై ఫోకస్ ఉండనుంది. ఈ ఐపీఎల్‌లో రోహిత్ 417 రన్స్ మాత్రమే చేసి నిరాశ పరచగా.. కోహ్లీ 15 మ్యాచ్‌ల్లో 741 రన్స్‌తో మరోసారి ఆరెంజ్ క్యాప్ నెగ్గాడు. కానీ, లీగ్‌లో కోహ్లీ స్ట్రయిక్ రేట్‌పై విమర్శలు వచ్చాయి. ఈ ఫార్మాట్‌కు తగినంత స్ట్రయిక్ రేట్‌తో ఆడటం లేదని కామెంటేటర్లు, మాజీ ప్లేయర్లు విమర్శించారు. ఇక, ఐపీఎల్‌లో కోహ్లీ ఓపెనర్‌గా వస్తున్నాడు.
కానీ,ఇండియా తరఫున వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగుతున్నాడు. కోహ్లీ మూడో నంబర్‌లోనే బ్యాటింగ్‌ను కొనసాగిస్తే రోహిత్‌తో కలిసి యంగ్ స్టర్ యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు.
అప్పుడు టీ20 టాప్ ర్యాంకర్ సూర్యకుమార్ సహా కేవలం నలుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లతో మాత్రమే ఇండియా ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ రోహిత్‌తో కలిసి కోహ్లీ ఓపెనింగ్ చేస్తే మిడిలార్డర్‌లో అదనపు బ్యాటర్‌ను అనుమతిస్తుంది. దాంతో ఐపీఎల్‌లో తన పవర్ హిట్టింగ్, 162.29 స్ట్రయిక్ రేట్‌తో సెలెక్టర్‌లను ఆకట్టుకున్న శివం దూబేకి తుది జట్టులో అవకాశం కల్పిస్తుంది.
దూబే మీడియం పేస్ బౌలింగ్ కూడా చేస్తాడు కాబట్టి పాండ్యాకు బ్యాకప్‌గా ఉంటాడు. గత టోర్నీలో ఆడని ఆల్‌రౌండర్ జడేజా, పేసర్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్తో పాటు కొత్తగా వచ్చిన శివం దూబే, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ తమ దైన ముద్ర వేయాలని తహతహలాడుతున్నారు. ఈ టోర్నీలో సత్తా చాటి జట్టుకు కప్పు అందిస్తే కుర్రాళ్ల భవిషత్తుకు ఢోకా ఉండదు. గతేడాది వన్డే వరల్డ్ కప్ కొద్దిలో చేజారిన నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ అందుకోవాలని రోహిత్, విరాట్ చాలా పట్టుదలగా ఉన్నారు. కప్పు నెగ్గితే ఈ ఇద్దరూ సంతృప్తిగా ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకొచ్చు.
నేడు బంగ్లాదేశ్‌తో వామప్ మ్యాప్
టీ20 వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా శనివారం బంగ్లాదేశ్‌తో టీమిండియా వామప్ మ్యాచ్ ఆడనుంది. టోర్నీలో సరైన కాంబినేషన్‌ను, ముఖ్యంగా సెకండ్ పేస్ బౌలింగ్ ఆప్షన్‌పై తుది అంచనాకు రావడమే టార్గెట్‌గా ఈ పోరులో బరిలోకి దిగనుంది. ఆలస్యంగా న్యూయార్క్ వచ్చిన విరాట్ కోహ్లీ శుక్రవారం టీమ్‌లో చేరాడు. లాంగ్ జర్నీ దృష్ట్యా అతను రెస్ట్ తీసుకుంటే మిగతా 14 మంది వామప్ ఆడే అవకాశం ఉంది.
కోర్ టీమ్‌లో చాలా మంది రెండు వారాలు ఆటకు దూరంగా ఉన్న నేపథ్యంలో తిరిగి రిథమ్ అందుకునేందుకు ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. సూపర్–8లో బంగ్లాతో ఆడే అవకాశం ఉండటంతో ఆ జట్టు బలాబలాలు కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా స్లో వికెట్లపై స్పిన్నర్లు షకీబ్ హసన్, మెహిదీ హసన్‌తో పాటు పేసర్ ముస్తాఫిజుర్‌తో సవాల్‌ను ఎలా తిప్పికొట్టాలనే దానిపై ఇండియా మిడిలార్డర్ బ్యాటర్లు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.
బౌలర్లు ఏం చేస్తరో?
ఈ టోర్నీలో టీమిండియా ముందుకెళ్లడంలో బౌలర్ల పాత్ర కీలకం కానుంది. బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ను పేస్ లీడర్ జస్‌ప్రీత్ బుమ్రా నడిపించనున్నాడు. ఐపీఎల్‌లో బుమ్రా సత్తా చాటినా అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. సవాల్ విసిరే యూఎస్ఏ, విండీస్‌లో పరిస్థితులకు అలవాటు అవ్వడం బ్యాటర్లతో పాటు బౌలర్లకు పరీక్ష కానుంది. సూపర్8, నాకౌట్ దశ జరిగే విండీస్ వికెట్లు ఉపఖండానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. కానీ, ఇండియా టీమ్‌లో ఇద్దరు లెఫ్టాండర్లు సహా నలుగు స్పిన్నర్లు ఉండటం గమనార్హం. చైనామన్ కుల్దీప్ యాదవ్, లెగ్గీ యుజ్వేంద్ర చహల్ చాన్నాళ్ల తర్వాత కలిసి దిగబోతున్నారు. తమ మ్యాచ్‌లన్నీ పగటి పూటే జరగనున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ నలుగురు స్పిన్నర్లను తీసుకున్నాడు. ఈ నిర్ణయం ఏ మేరకు ఫలితం ఇస్తుందో చూడాలి.