- అమెరికా, వెస్టిండీస్‌లో పోటీలు
- బరిలో రికార్డు స్థాయిలో 20 జట్లు
- తొలిపోరులో కెనడాతో యూఎస్‌ఏ ఢీ
- న్యూగినియాతో విండీస్ పోరు
ఐపీఎల్, బీబీఎల్, పీఎస్‌ఎల్, ఎల్‌పీఎల్.. ఇలా పదుల కొద్దీ లీగ్‌లతో టీ20 క్రికెట్ కొత్త శిఖరాలకు చేరుతున్నా.. టీ20 వరల్డ్ కప్‌కు ఉండే మజానే వేరు..! ఇంటర్నేషనల్ స్టార్లు తమ దేశ జెర్సీ, జెండాతో బరిలోకి దిగి .. స్టేడియంలో కొదమసింహాల్లా కొట్లాడుతుంటే వచ్చే కిక్కే వేరు..! రెండేండ్లకోసారి టీ20 ఫార్మాట్‌లోని అసలైన మజాను అందించే టీ20 వరల్డ్ కప్ తొమ్మిదో ఎడిషన్ సరికొత్తగా ముస్తాబై వచ్చింది..! రికార్డు స్థాయిలో 20 జట్లు బరిలోకి దిగుతున్న మెగా ఈవెంట్‌కు తొలిసారి యూఎస్‌ఏ కూడా ఆతిథ్యం ఇవ్వనుంది.
విండీస్ దీవులతో పాటు బేస్‌బాల్ అడ్డా అయినా అగ్రరాజ్యం గడ్డపై తొలిసారి క్రికెట్ బాల్ సందండి చేయనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక వంటి మేటి జట్లు కప్పు కోసం కదం తొక్కేందుకు సిద్ధమవగా.. యూఎస్‌ఏ, కెనడా,పపువా న్యూగినియా, ఉగాండా వంటి చిరు జట్లూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ చిన్న కప్పు ఎవరికి చిక్కినా.. ఈ రోజు మొదలు.. ఈ నెలంతా క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్కే.. కిక్కు!
న్యూయార్క్: నాలుగేండ్ల గ్యాప్‌లో టీ20 వరల్డ్ కప్ ముచ్చటగా మూడోసారి అభిమానుల ముందుకొచ్చింది. తొలిసారి అగ్రరాజ్యం అమెరికా గడ్డపై అడుగు పెట్టి.. పక్కనే ఉన్న కరీబియన్ దీవుల్లో నెల రోజుల పాటు సందడి చేయనుంది. 2028లో అమెరికా (లాస్ ఏంజెల్స్) ఆతిథ్యం ఇచ్చే ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఆ ఆటను విశ్వవ్యాప్తం చేసే ప్రయత్నాల్లో భాగంగా జట్ల సంఖ్యను పెంచిన ఐసీసీ అమెరికాకు ఆతిథ్య హక్కులు ఇచ్చింది. మొత్తం 55 మ్యాచ్‌ల్లో 16 యూఎస్‌కు కేటాయించింది.
అగ్రరాజ్యంలోని న్యూయార్క్, ఫ్లోరిడా, డల్లాస్ నగరాల్లో క్రికెట్ సందడి ప్రపంచాన్ని ఆకర్షించనుంది. సూపర్8 రౌండ్, సెమీఫైనల్స్, ఫైనల్ సహా మరో 39 మ్యాచ్‌లను వెస్టిండీస్‌లోని ఏడు వేదికలకు కేటాయించారు. అరంగేట్రం జట్లు అమెరికా, కెనడా జట్ల మధ్య డల్లాస్‌లో ఆదివారం ఉదయం జరిగే తొలి పోరుతో టోర్నీకి తెరలేవనుంది. మరో ఆతిథ్య జట్టు వెస్టిండీస్ గయానా వేదికగా పపువా న్యూగినియాతో తలపడనుంది. ఈ నెల 29న బార్బడోస్‌లో జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.
కొత్త జట్లు.. కొత్త ఫార్మాట్
అమెరికా, కెనడా, ఉగాండా జట్లు టీ20 వరల్డ్ కప్‌లో అరంగేట్రం చేస్తున్నాయి. కొత్తగా నాలుగు జట్ల చేరికతో ఈ సారి ఫార్మాట్ కూడా మారింది. గత సీజన్ వరకూ క్వాలిఫికేషన్ రౌండ్, సూపర్–12, నాకౌట్ దశలో పోటీ సాగింది. ప్రధాన టీమ్స్ నేరుగా సూపర్12లోనే పోటీ పడ్డాయి. ఈసారి గ్రూప్, సూపర్–8, నాకౌట్ దశలుగా పోటీ జరుగుతుంది. 20 టీమ్స్‌ను ఐదేసి చొప్పున నాలుగు గ్రూపుల్లో చేర్చారు.
తొలి దశలో ప్రతీ టీమ్ తన గ్రూప్‌లోని మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతీ గ్రూప్ నుంచి టాప్–2లో నిలిచిన జట్లు సూపర్–8 రౌండ్‌కు క్వాలిఫై అవుతాయి. ఈ రౌండ్లో నాలుగు జట్లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఒక్కో టీమ్ గ్రూప్‌లోని మిగతా ప్రత్యర్థులతో ఒక్కోసారి తలపడుతుంది. రెండు గ్రూప్స్‌లోని టాప్2 టీమ్స్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీస్, ఫైనల్‌కు రిజర్వ్ డే కేటాయించారు. రెండో సెమీస్‌కు రిజర్వ్ డే లేదు. వర్షం, ఇతర కారణాలతో ఏదైనా ఆటంకం కలిగితే మ్యాచ్‌ను పూర్తి చేసేందుకు అదనపు సమయం కేటాయించారు.
రికార్డులు బ్రేక్ పక్కా!
ఈ సారి పలు చిన్న జట్లు పోటీలో నిలవడం.. గతంతో పోలిస్తే ఈ ఫార్మాట్‌లో పవర్ హిట్టింగ్ మోతాదు పెరగడంతో ఈ టోర్నీలో రికార్డులు మోతెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్న జట్లపై ఐసీసీ ఫుల్ మెంబర్స్ టీమ్స్ బ్యాటర్లు విరుచుకుపడే అవకాశం ఉంది. తొలి రౌండ్‌లో చాలా మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగి.. పరుగుల పరంగా కొత్త రికార్డులు నమోదయ్యే ఆస్కారం ఉంది.
మరోటి చిక్కేనా?
తొలి ఎడిషన్‌లో విజేతగా నిలిచిన ఇండియా రెండోసారి టీ20 వరల్డ్ కప్ నెగ్గే ప్రయత్నాన్ని ఈసారి కూడా కొనసాగించనుంది. 2013లో చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన తర్వాత టీమిండియా మరో ఐసీసీ ఈవెంట్‌లో విజేతగా నిలవలేకపోయింది. విరాట్ కోహ్లీ ఒక్క కప్పు కూడా లేకుండానే కెప్టెన్సీ కెరీర్‌ను ముగించగా.. అతని స్థానంలో పగ్గాలు అందుకున్న రోహిత్ ఖాతాలో ఐసీసీ కప్పు లేదు. ఇది ఇద్దరి కెరీర్‌లో వెలితిగా మారింది. రోహిత్ ప్రతీ టీ20 కప్‌లోనూ బరిలోకి దిగగా. 2012 టోర్నీలో తొలిసారి ఆడిన విరాట్ ఇప్పుడు ఆరోసారి మెగా టోర్నీలో ఆడనున్నాడు. వయసు దృష్ట్యా ఈ ఇద్దరికీ ఇదే చివరి టీ20 కప్పు కానుంది.
గత ఎడిషన్‌లో మూస బ్యాటింగ్‌తో సెమీస్‌లోనే ఇంటిదారి పట్టిన ఇండియా ఈసారి ఆ తప్పిదం చేయకూడదని నిర్ణయించుకుంది. ప్రత్యర్థి జట్లతో పోలిస్తే ఇండియా టీమ్‌లో ఇప్పటికీ ఎక్కువ మంది పవర్ హిట్టర్లు లేరు. కానీ, కరీబియన్ దీవుల్లోని వికెట్లు స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటం ఇండియాకు కాస్త ప్లస్ పాయింట్ కానుంది. గ్రూప్–ఎలో ఉన్న ఇండియా ఈ నెల 5న ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. 9న న్యూయార్క్‌లో ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్ టోర్నీకే హైలైట్‌గా మారనుంది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ టైటిల్ నిలబెట్టుకొని మూడోసారి విజేతగా నిలవాలని చూస్తోంది.
పవర్ హిట్టర్లతో కూడిన వెస్టిండీస్ సొంతగడ్డపై అనుకూలతలను ఉపయోగించుకొని మూడో కప్పుతో తమ టీమ్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తోంది. మాజీ విన్నర్లు ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక కూడా ఇంకోసారి టైటిల్ అందుకోవాలని ఆశిస్తుండగా.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా ఐసీసీ ఈవెంట్లలో ఈసారైనా ఖాతా తెరవాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు ఐర్లాండ్, స్కాట్లాండ్ సంచలనాలపై ఫోకస్ పెట్టనున్నాయి.