వెలుగు స్పోర్ట్స్ డెస్క్ : టీ20 క్రికెట్ అంటేనే సంచలనాలకు మారుపేరు. జట్టు చిన్నదైనా, ప్లేయర్ ఎలాంటి వాడైనా, అవకాశం వస్తే ఒక్క రాత్రిలోనే స్టార్లుగా మారిపోతారు. కొంత మంది ఐపీఎల్‌తో హీరోలుగా మారితే... మరికొంత మంది మెగా టోర్నీలో అదృష్టం కోసం వేచి చూస్తున్నారు. దేశం తరఫున సత్తా చాటితే వరల్డ్ క్రికెట్ లీగ్‌లన్నీ వెంటపడే చాన్స్ ఉండటంతో చిన్న టీమ్స్ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పేరుకు చిన్న జట్లే అయినా సంచలనాలు సృష్టించడంలో పెద్ద జట్లకు ఏమాత్రం తీసిపోవు. అలాంటి కొన్ని టీమ్స్‌ను ఇప్పుడు చూద్దాం.
నమీబియా
చూడటానికి చిన్న జట్టే అయినా.. ఆఫ్రికా రీజినల్ క్వాలిఫయర్స్‌లో నమీబియా సూపర్ పెర్ఫామెన్స్ చూపెట్టింది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టాప్ ప్లేస్‌లో మెగా టోర్నీకి క్వాలిఫై అయ్యింది. ఈ క్రమంలో ఉగాండా, జింబాబ్వేలాంటి జట్లను కూడా ఓడించింది. 2021 ఎడిషన్‌లో శ్రీలంకను ఓడించిన నమీబియా అదే జోరును కంటిన్యూ చేయాలని భావిస్తోంది.
ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నమీబియా ఎక్కువగా డేవిడ్ వీస్‌పై ఆధారపడింది. ఈ దశాబ్దంలో అతనికి ఇది మూడో టీ20 వరల్డ్ కప్ కావడం విశేషం. అద్భుతమైన ఆల్‌రౌండర్‌గా అతనికి పేరు ఉంది. అవకాశం లభిస్తే బ్యాట్, బాల్‌తో చాలా ప్రభావం చూపిస్తాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను తిప్పే సత్తాకు కొదవలేదు. కెప్టెన్ గెరాల్డ్ ఎర్మాసన్, గ్రీన్, లింగెన్, రుబెన్, బ్రాసెల్ కూడా అంచనాలు అందుకుంటే నమీబియా నుంచి సంచలనాలు ఆశించొచ్చు.
ఒమన్
గ్రూప్–బిలో ఉన్న ఏకైక ఆసియా టీమ్. ప్లేయర్ల ర్యాంక్‌లు, ఎక్స్‌పీరియెన్స్ బట్టి మంచి టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో ఆడటం ఇది మూడోసారి. మంచి పెర్ఫామెన్స్‌తో తమదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు. నమీబియాతో ఆడే తొలి మ్యాచ్‌తోనే తమ సత్తా చూపాలని ప్రతి ఒక్కరు లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో రెండుసార్లు ఓడినా ఈసారి మాత్రం విజయంతోనే టోర్నీ మొదలుపెట్టాలని భావిస్తున్నారు.
కెప్టెన్ అకీబ్ ఇలియాజ్ టాప్ ఆర్డర్‌లో చాలా కీలకం. ఉపయుక్తమైన స్పిన్నర్ కూడా. అతని బ్యాటింగ్ యావరేజ్ 42.5కాగా, స్ట్రయిక్ రేట్ 158.38గా ఉంది. మెగా టోర్నీలో ముందుకెళ్లాలంటే అతను కచ్చితంగా రాణించాల్సిన అవసరం ఉంది. మాజీ కెప్టెన్ జీషాన్ మక్సూద్, కశ్యప్ ప్రజాపతి, ప్రతీక్ అథవాలె, అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, నదీమ్ మంచి పెర్ఫామెన్స్‌ను చూపెడితే భారీ విజయాలను చూడొచ్చు.
స్కాట్లాండ్
రిచీ బెరింగ్‌టన్ నేతృత్వంలోని స్కాట్లాండ్‌లో గ్లోబల్ టీ20 క్రికెట్‌లో ఆడిన ఎక్స్‌పీరియెన్స్ ఉన్న అనేక మంది ఆటగాళ్లు ఉన్నారు. షార్ట్ ఫార్మాట్‌లో వెస్టిండీస్‌తో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అనుభవం వారి సొంతం. ఇక 2018లో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన ఘనత కూడా స్కాట్లాండ్‌కు ఉంది. దేశంలో క్రికెట్‌ను అభివృద్ధి చేయడానికి ఈ మెగా టోర్నీని ఓ మెట్టుగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది.
లెఫ్టార్మ్ స్పిన్నర్ మార్క్ వాట్ కీలక బౌలర్. బ్యాటర్ల క్రీజ్‌ను బట్టి బాల్స్ వేయడంలో అతను దిట్ట. బ్యాటర్, మ్యాచ్ పరిస్థితిని బట్టి డెలివరీ పాయింట్‌ను మారుస్తాడు. ప్రత్యర్థి అంచనాలకు అందకుండా వేగంలో హెచ్చుతగ్గులు చేస్తాడు. గతేడాది జింబాబ్వేలో జరిగిన మెన్స్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో శ్రీలంక, వెస్టిండీస్‌ను ముప్పు తిప్పలు పెట్టాడు. అతను సక్సెస్ అయితే పెద్ద జట్లకు కూడా ప్రమాదం తప్పదు.
నెదర్లాండ్స్
గ్రూప్–డిలో ఉన్న నెదర్లాండ్స్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. అవకాశం వస్తే పెద్ద జట్లను కూడా గట్టి దెబ్బకొట్టగల ప్రమాదకరమైన ప్లేయర్లు ఉన్నారు. స్కాట్ ఎడ్వర్డ్స్ కెప్టెన్సీలో నెదర్లాండ్ చాలా మంచి పెర్ఫామెన్స్ చేస్తోంది. గతంలో టీ20 వరల్డ్ కప్ ఆడిన అనుభవం ఉండటం వాళ్లకు ప్లస్ కానుంది. తెలుగు ప్లేయర్ తేజ నిడమనూర్, బాస్ డిలీడ్, వాన్‌బీక్ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉన్నారు.
మ్యాక్స్ ఓ డౌడ్ స్టార్ హిట్టర్. టాప్ ఆర్డర్‌లో అతను నిలబడితే భారీ స్కోర్లను ఆశించొచ్చు. మీకెరెన్, ఆర్యన్ దత్, టిమ్ ప్రింజిల్‌తో కూడిన బౌలింగ్ కూడా మెరుగ్గానే ఉంది. సౌతాఫ్రికా తరఫున అండర్–19 క్రికెట్ ఆడిన సైబ్రాండ్ ఎంగెల్‌బెర్ట్.. నెదర్లాండ్స్ తరఫున వన్డే వరల్డ్ కప్ ఆడాడు. అదే ఫామ్‌ను టీ20లోనూ చూపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.