వెలుగు స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ ఈవెంట్లలో అత్యంత విజయవంతమైన జట్టుగా ఆస్ట్రేలియా, డిఫెండింగ్ చాంపియన్‌గా ఇంగ్లండ్ ఈసారి టీ20 వరల్డ్ కప్‌లో బరిలోకి దిగుతున్నాయి. గ్రూప్–బితో పాటు టోర్నీ టాప్ ఫేవరెట్స్‌గా ఈ రెండు జట్లకే ఎక్కువ అవకాశాలున్నాయి. నమీబియా, ఒమన్, స్కాట్లాండ్‌లాంటి చిన్న జట్లు కూడా ఇదే గ్రూప్‌లో ఉన్నా.. అందరి దృష్టి మాత్రం ఆసీస్, ఇంగ్లండ్‌పైనే ఉన్నాయి. కానీ ధనాధన్ క్రికెట్‌లో ఎప్పుడు ఎలాంటి ఫలితం వస్తుందో అంచనా వేయలేని నేపథ్యంలో గ్రూప్ ఫలితాలను ఆసక్తికరంగా మార్చడానికి మిగతా మూడు చిన్న జట్లకు కూడా సామర్థ్యం ఉంది. అయితే టాప్–2లో ఉండే టీమ్స్ మాత్రమే సూపర్–8కు వెళ్లే చాన్స్ ఉండటంతో ఆసీస్, ఇంగ్లండ్‌లో టాప్ ప్లేస్ ఎవరిదో చూడాలి.
‘కంగారు’పెడతారా..?
2022లో స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌కు చేరుకోలేకపోయిన ఆసీస్ ఈసారి మాత్రం ఏకంగా టైటిల్‌పైనే గురి పెట్టింది. ఇతర జట్లతో మ్యాచ్‌లు ఎలా ఆడినా.. ఐసీసీ ఈవెంట్స్ అనేసరికి కంగారూలకు ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. అందుకే ఐసీసీ టైటిల్స్‌ను అత్యధికంగా నెగ్గిన టీమ్ రికార్డు కూడా వాళ్లకే సొంతం. వన్డే వరల్డ్ కప్ నెగ్గి ఊపుమీదున్న ఆసీస్‌ను నిలువరించాలంటే మిగతా జట్లు శక్తికి మించి శ్రమించాలి. ప్రస్తుతం ఐపీఎల్‌లో టాప్ ఫామ్ చూపెట్టిన చాలా మంది ప్లేయర్లు మెగా టోర్నీలో బరిలోకి దిగుతుండటం కలిసొచ్చే అంశం.
సమష్టిగా ఆడటంతో పాటు వ్యక్తిగత పెర్ఫామెన్స్‌తో జట్టును గెలిపించే ఎక్కువ మంది ప్లేయర్లు ఉండటం కంగారూలకు అదనపు బలం. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ సెమీస్, ఫైనల్లో తన సత్తా ఏంటో చూపెట్టిన ట్రావిస్ హెడ్‌పైనే ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ దృష్టి నెలకొంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున కూడా ఐపీఎల్‌లో దుమ్మురేపిన అతను 200 స్ట్రయిక్ రేట్‌తో 500 రన్స్ చేశాడు. కాబట్టి కనీసం ఒక్క పది ఓవర్లు అతను క్రీజులో ఉన్నాడంటే కచ్చితంగా వరల్డ్ రికార్డు స్కోర్లు నమోదు కావాల్సిందే. ఆసీస్‌కు రెండు ఐసీసీ టైటిల్స్ అందించిన హెడ్ మరోసారి తన డైనమిక్ పెర్ఫామెన్స్‌తో మూడో టీ20 ట్రోఫీని అందించాలని భావిస్తున్నాడు. మిచెల్ మార్ష్ కెప్టెన్సీతో మాయ చేస్తే ఆసీస్‌కు తిరుగుండదు. మ్యాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, గ్రీన్, స్టోయినిస్‌లాంటి బలమైన ఆల్‌రౌండర్లకు వార్నర్‌లాంటి అనుభవజ్ఞుడు తోడుగా ఉన్నాడు. కమిన్స్, స్టార్క్, హాజిల్‌వుడ్, జంపాతో కూడిన బౌలింగ్ బలం కూడా చాలా ఎక్కువగానే ఉంది.
‘కప్’ను నిలబెట్టుకుంటారా?
డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న ఇంగ్లండ్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేం. గతంలో పోలిస్తే టీ20ల్లో చాలా మెరుగ్గా ఆడుతున్నారు. అటాకింగ్ గేమ్ ఆడే నైపుణ్యం ఉన్న చాలా మంది ప్లేయర్లు ప్రస్తుత టీమ్‌లో ఉన్నారు. కాకపోతే ఒక్కోసారి నిలకడలేమితో ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. పరిస్థితిని అంచనా వేసి ఆడితే ప్రత్యర్థి ఎంత పెద్ద జట్టైనా వీళ్ల ఆట ముందు తేలిపోవాల్సిందే. నిఖార్సైన ఆల్‌రౌండర్లకు కొదువలేని టీమ్. లీగ్ దశలో ఆసీస్‌కు పోటీ ఇస్తే సూపర్–8లో మిగతా జట్లకూ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
ఈ టోర్నీలో బట్లర్ హిట్టింగ్ ప్రధాన ఆయుధం కాగా, బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, డకెట్, ఫిల్ సాల్ట్ చెలరేగితే భారీ స్కోర్లు ఆశించొచ్చు. ఆల్‌రౌండర్లుగా మొయిన్ అలీ, సామ్ కరన్, విల్ జాక్స్, లివింగ్‌స్టోన్ చాలా కీలకం. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి రావడం కాన్ఫిడెన్స్ పెంచే అంశం. అయితే కుడి మోచేతి గాయంతో ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న ఆర్చర్ ప్రస్తుత ఫామ్ ఎలా ఉందన్న ఆందోళన కూడా ఇంగ్లండ్ శిబిరంలో కనిపిస్తున్నది.
అయితే టోర్నీకి ముందు ససెక్స్‌తో కలిసి 10 రోజుల ట్రెయినింగ్ క్యాంప్‌లో గడిపాడు. గాయం ఇబ్బంది కనిపించకపోయినా బాల్‌తో ప్రభావం చూపడానికి కాస్త టైమ్ పట్టొచ్చు. గత టోర్నీలో అత్యంత ప్రభావం చూపిన మార్క్ వుడ్ మరోసారి తన పేస్ సత్తా చూపితే ఇంగ్లండ్‌ను ఆపడం కష్టం. టోప్లీ, జోర్డాన్ సరైన సహకారం అందించాల్సి ఉంటుంది. స్పిన్నర్లుగా ఆదిల్ రషీద్, అలీ నుంచి గండం పొంచి ఉంటుంది. ఓవరాల్‌గా మనసు పెట్టి ఆడితే ఇంగ్లండ్‌ను నిలువరించే శక్తి మిగతా టీమ్స్‌కు కాస్త తక్కువే అని చెప్పొచ్చు.