T20 World Cup 2024: అమెరికా ఔట్.. సెమీస్ బెర్త్ కోసం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పోటాపోటీ

T20 World Cup 2024: అమెరికా ఔట్.. సెమీస్ బెర్త్ కోసం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పోటాపోటీ

టీ20 వరల్డ్ కప్ 2024 లో ప్రస్తుతం సూపర్ 8 మ్యాచ్ లు జరుగుతున్నాయి. సూపర్ 8 అయినా ఇక్కడ పసికూన జట్లు కూడా ఉండడంతో సెమీస్ కు వెళ్లే జట్లను అంచనా వేయడం కష్టం కాకపోవచ్చు. మొదటి గ్రూప్ లో ఆస్ట్రేలియా, భారత్ సెమీస్ కు వెళ్లడం దాదాపుగా ఖాయం. ఇదే గ్రూప్ లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నప్పటికీ ఆసీస్, టీమిండియాను తట్టుకోవడం వీరికి కష్టమే. మరోవైపు గ్రూప్ 2 లో మాత్రం ఆసక్తికర పోటీ నడుస్తుంది. వెస్టిండీస్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా పోటీ పడుతున్నాయి. వీటిలో ఏ జట్లు సెమీస్ కు చేరతాయో ఇప్పడు చూద్దాం. 

గ్రూప్ 2 లో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, అమెరికా జట్లున్నాయి. వీటిలో అమెరికా ఆడిన రెండు మ్యాచ్ లు ఓడిపోయి సెమీస్ ఆశలను కోల్పోయింది. శనివారం (జూన్ 22) వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో భారీ ఓటమి ఆ జట్టు సెమీస్ ఆశలను దెబ్బ తీసింది. దీంతో ఇప్పుడు ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ సెమీస్ రేస్ లో ఉన్నాయి. టాప్ 2 లో నిలిచి ఏ జట్లు సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటాయో అంతు చిక్కడం లేదు. సౌతాఫ్రికా ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలిచి సెమీస్ కు చేరువగా వెళ్లినా.. ఇంకా అధికారికంగా బెర్త్ ఖరారు కాలేదు. 

వెస్టిండీస్ ఇంగ్లాండ్ పై ఓడిపోవడంతో తమ చివరి మ్యాచ్ లో సౌతాఫ్రికాపై ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. మరోవైపు ఇంగ్లాండ్ వెస్టిండీస్ పై గెలిచి సౌతాఫ్రికాపై ఓడింది. చివరి మ్యాచ్ లో అమెరికాపై భారీ విజయంపై కన్నేసింది. సౌతాఫ్రికా తమ చివరి మ్యాచ్ లో వెస్టిండీస్ పై ఓడిపోతే రన్ రేట్ తో ఇంటి దారి పట్టే అవకాశముంది. మూడు జట్లు బలంగా ఉండడంతో ఏ జట్టు సెమీస్ కు చేరుతుందో ఆసక్తికరంగా మారింది. ఒకవేళ భారత్ సెమీస్ ఫైనల్ కు వస్తే ఈ మూడు జట్లలో ఏ జట్టుతో సెమీస్ ఆడతారో అని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు.