T20 World Cup 2024: వివాదంలో పాకిస్థాన్.. ప్రధాన పేసర్‌పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు!

T20 World Cup 2024: వివాదంలో పాకిస్థాన్..  ప్రధాన పేసర్‌పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు!

అమెరికా చేతిలో ఓడి తీవ్ర దుఃఖంలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు మరో వివాదంలో చిక్కుకుంది. యూఎస్‌ఏతో మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ రస్టీ థెరాన్ ఆరోపించాడు. పాక్ ప్రధాన పేసర్ హారీస్ రౌఫ్‌ బంతి రూపు రేఖలను మార్చేందుకు ప్రయత్నించాడని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. 

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 159 పరుగులు చేయగా.. ఛేదనలో అమెరిగా సునాయాసంగా గెలిచేలా కనిపించింది. విజయానికి చివరి 7 ఓవర్లలో 56 పరుగులు కావాల్సి వచ్చాయి. దీంతో అమెరికా ఈజీగా గెలుస్తుందని అనుకున్నారంతా. అయితే, ఆ సమయంలో పాక్ బౌలర్లు మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారు. వరుసగా రెండు ఓవర్లలో 2 వికెట్లు తీసి.. అమెరికన్లను ఒత్తిడిలోకి నెట్టారు. చివరకు విజయానికి ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు అవసరం అయ్యాయి. ఇలా పాక్ ఉన్నట్టుండి పుంజుకోవడానికి బాల్ ట్యాంపరింగే కారణమని రస్టీ థెరాన్ ఆరోపించాడు.

"కొత్త బంతిని రౌఫ్‌ గోర్లతో గీకుతూ కనిపించాడు. బంతి రూపు రేఖలు మారడంతో రెండు ఓవర్ల ముందు మార్చిన బంతిని మళ్లీ తీసుకొచ్చారు? రివర్స్‌ స్వింగ్‌ రాబట్టగలిగారు. రౌఫ్ తన బొటనవేలితో బంతిపై రుద్దుతూ పరిగెత్తడాన్ని మీరు చూడొచ్చు.." అంటూ రస్టీ థెరాన్.. ఐసీసీని ట్యాగ్‌ చేస్తూ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్టు నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే, ఈ వ్యవ‌హారంపై ఐసీసీ మాత్రం ఇంకా స్పందించ‌లేదు. ఒక‌వేళ పాక్ పేస‌ర్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడివుంటే నిషేధానికి గుర‌వ్వడం ఖాయం.

బాల్ ట్యాంపరింగ్ ఎందుకు చేస్తారు.?

బాల్ ట్యాంపరింగ్ వల్ల బంతి రూపు రేఖలు మారిపోతాయి. కొత్త బంతితో రివర్స్ స్వింగ్ కష్టం. అదే బంతి స్వరూపాన్ని మారిస్తే అది రివర్స్ స్వింగ్ చేసేందుకు అనువుగా ఉంటుంది. తద్వారా ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేర్చొచ్చు. ఇందులో భాగంగానే ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడతారు.  

సంక్షిప్త స్కోర్లు:

  • పాకిస్థాన్‌: 20 ఓవర్లలో 159/7 
  • అమెరికా: 20 ఓవర్లలో 159/3

సూపర్‌ ఓవర్‌ స్కోర్లు

  • అమెరికా: 18/1
  • పాకిస్థాన్‌: 13/1