ఆమె పేరు రష్మి. గుజరాత్‌లోని ఓ పల్లెటూరిలో పుట్టి పెరుగుతుంది. రాకెట్‌లా దూసుకెళ్లడం దేవుడు ఆమెకిచ్చిన వరం. గొప్ప రన్నర్‌గా పేరు తెచ్చుకుని తన ఊరికి ప్రపంచస్థాయిలో గుర్తింపు తేవాలని ఆశపడుతుంది రష్మి. విజయానికి కాస్త దూరంలో ఉందనగా ‘జెండర్ టెస్ట్’ రూపంలో ఆమె కల చెదిరిపోతుంది. అథ్లెట్స్‌కి చేసే ఈ టెస్ట్‌లో రష్మికి ఆడపిల్ల లక్షణాలు తక్కువగా, మగవాళ్ల లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని రిపోర్ట్ వస్తుంది. దాంతో ఆమెని బ్యాన్ చేస్తుంది స్పోర్ట్స్ అసోసియేషన్. అక్కడి నుంచి ఆమెకన్నీ అవమానాలే. వాటన్నింటినీ తట్టుకుని ఎలా నిలబడింది, కోర్టుకెళ్లి ఎలా గెలిచిందనేది ‘రష్మి రాకెట్’ సినిమా కథ.
అక్టోబర్ 15న జీ5లో విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. అది చూస్తే రష్మి పాత్రలో నటించిన తాప్సీకి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరెవరూ. అచ్చమైన రన్నర్‌లా కనిపించేందుకు పూర్తిగా మేకోవర్ అయ్యింది. రష్మి పాత్రను ప్రాణం పెట్టి చేశానంటోంది. ఇటీవల ఈ సినిమా పోస్టర్‌ని నెట్‌లో పోస్ట్ చేసిందామె. వెంటనే ఓ నెటిజన్.. ‘అచ్చం మగాడిలా ఉన్నావ్’ అని కామెంట్ చేశాడు. దానిపై ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కాస్త స్ట్రాంగ్‌గానే రియాక్టయ్యింది తాప్సీ. ‘అవును.. నేను మగాడినే.. అయితే ఏంటట? ఓ ఆడపిల్ల శరీరం గురించి ఏమాత్రం ఆలోచించకుండా కామెంట్లు చేసేస్తారు. నేను వాటిని లెక్క చేయను. పైగా కాంప్లిమెంట్స్‌లా తీసుకుంటాను. కానీ బాధపడేవాళ్లు, తమలో తాము కుమిలిపోయే ఆడాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లనలా బాధపెట్టే హక్కు వీళ్లకెవరిచ్చారు? అలాంటివాళ్ల కోసమే ఈ సినిమా’ అని చెప్పింది. స్ట్రాంగ్ రోల్స్ చేయడమే కాదు.. వ్యక్తిగా కూడా తాను స్ట్రాంగేనని మరోసారి ప్రూవ్ చేసింది.