ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తబలా విద్యాంసుడు జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో అమెరికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జాకీర్ హుస్సేన్ మృతితో భారతీయ చలన చిత్ర రంగం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ముంబైలో పుట్టిన జాకీర్ హుస్సేన్..భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పద్మశ్రీ, పద్మభూషణ్,పద్మవిభూషణ్ సహా పలు అవార్డులను అందుకున్నారు.
తబలాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన జాకీర్ హుస్సేన్..లెజెండరీ తబలా మాస్ట్రో అల్లా రఖా పెద్ద కుమారుడు. హుస్సేన్ తన తండ్రి వారసత్వానికి అద్దం పట్టేలా సంగీత ప్రపంచంలో ఒక విశిష్టమైన మార్గాన్ని నిర్మించాడు.
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హుస్సేన్ తన కెరీర్‌లో ఐదు గ్రామీ అవార్డులను అందుకున్నారు.2024 ప్రారంభంలో జరిగిన 66వ గ్రామీ అవార్డ్స్‌లో మూడు ప్రశంసా అవార్డులు పొందారు. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శాస్త్రీయ సంగీత విద్వాంసులలో ఒకరైన హుస్సేన్‌కు 1988లో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ లభించాయి.
జాకీర్ హుస్సేన తన ఆరుదశాబ్దాలుగా సంగీతకారుడిగా ఎంతో మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించాడు. అనేక మంది ప్రసిద్ధ భారతీయ ,అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు.
1973లో ఇంగ్లీష్ గిటారిస్ట్ జాన్ మెక్‌లాఫ్లిన్, వయోలిన్ వాద్యకారుడు ఎల్ శంకర్, పెర్కషన్ వాద్యకారుడు వినాయక్‌రామ్‌లతో కలిసి అతని సంచలనాత్మక ప్రాజెక్ట్ జాజ్ లతో భారతీయ శాస్త్రీయ సంప్రదాయాలను మిళితం చేయడం ద్వారా సంగీతానికి సొబగులు దిద్దారు. ఇది గతంలో ఎన్నడూ వినని ఫ్యూజన్ శైలిని సృష్టించింది.
తన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను మైమరపించిన జాకీర్ హుస్సేన్ ఇకలేరు అని తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో సంతాపం వెల్లువెత్తింది.. ప్రముఖులు జాకీర్ హుస్సేన్ మృతిపట్ల సంతాపం తెలిపారు.