
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సురావజ్జుల స్నేహిత్ వరల్డ్ టాప్–100 ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన తొలి ప్యాడ్లర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇటీవల చెన్నైలో జరిగిన డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించిన స్నేహిత్ ఏకంగా 34 స్థానాలు మెరుగై వరల్డ్ ర్యాంక్ 89కు చేరుకున్నాడు.
ఈ టోర్నమెంట్‌లో స్నేహిత్ వరల్డ్ నంబర్ 29 యుకియా ఉడా (జపాన్)ను, ఆ తర్వాత ఇండియా లెజెండరీ ప్యాడ్లర్ శరత్ కమల్ ను ఓడించి ఔరా అనిపించాడు. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఓడినప్పటికీ శరత్ కమల్ తో కలిసి మెన్స్ డబుల్స్ సెమీఫైనల్స్‌కు చేరి ఆకట్టుకున్నాడు. ‘వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్ –100లో చేరడం నా మెయిన్ టార్గెట్.
దాన్ని అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నా తదుపరి లక్ష్యం టాప్ 50లో చేరడమే’ అని స్నేహిత్ చెప్పాడు. తన
కోచ్ సోమ్‌నాథ్ ఘోష్, ఫిట్‌నెస్ ట్రైనర్ హిరాక్ బాగ్చీకి థ్యాంక్స్ చెప్పాడు.