AP News: సీమలో టెన్షన్​.. టెన్షన్​. తాడిపత్రిలో జేసీ VS పెద్దారెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రి (Tadipatri) లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ (YCP) నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Pedda Reddy) చాలా రోజుల తర్వాత తిరిగి తాడిపత్రికి వచ్చారు. అయితే, ఆయన రాకను నిరసిస్తూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గంలోకి ఎందుకు వచ్చాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. వైసీపీ నేత కందిగోపుల మురళి ఇంట్లోకి వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అంతేకాకుండా వాహనాలపై దాడులు చేసుకోవడంతో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆందోళనకారులను అదుపు చేసి నియోజకవర్గంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. గాయలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, పెద్దారెడ్డికి హైకోర్టులో బెయిల్ మంజురు కావడంతోనే ఆయన తాడిపత్రికి వచ్చినట్లు తెలుస్తుంది.