ఆదరాబాదరాగా ఇంజనీరింగ్ కాలేజీల హియరింగ్

ఆదరాబాదరాగా ఇంజనీరింగ్ కాలేజీల హియరింగ్
  • ఫీజులు నిర్ణయించేందుకు విచారణ చేపట్టిన టీఏఎఫ్ఆర్సీ 
  • ఒక్కో రోజు 20 కాలేజీల హియరింగ్ 
  • 8 రోజుల్లోనే 163 కాలేజీల విచారణ పూర్తయ్యేలా షెడ్యూల్ 
  • ఇట్లయితే వివరాలు సక్రమంగా వస్తాయా? అనే అనుమానాలు 

హైదరాబాద్, వెలుగు: రానున్న మూడేండ్ల పాటు ప్రైవేట్ ఇంజనీరింగ్​కాలేజీల్లో ఫీజులు నిర్ణయించేందుకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులరేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) నిర్వహిస్తున్న పర్సనల్ హియరింగ్ ప్రక్రియపై విమర్శలు వస్తున్నాయి. పూటకు 10 కాలేజీల చొప్పున ప్రతి రోజు 20 కాలేజీల మేనేజ్మెంట్లతో కమిటీ ఆదరాబాదరాగా విచారణ నిర్వహిస్తున్నది. 

ఇలా నిర్వహిస్తే కాలేజీల్లో జరిగే తప్పులను గుర్తించడం కష్టమవుతుందని లెక్చరర్లు చెబుతున్నారు. గతంలో 2022లో టీఏఎఫ్ఆర్సీ ఆడిటింగ్ సక్రమంగా చేయకపోవడంతో భారీగా ఫీజులు పెంచాలని నిర్ణయించారు. ఆ తర్వాత తప్పును గుర్తించి సరిచేశారు. ఈసారి అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్టూడెంట్లు, లెక్చరర్లు కోరుతున్నారు.  

గతంలోనూ అంతే.. 

రాష్ట్రంలో 2025–26, 2026–27, 2027–28 విద్యాసంవత్సరాల బ్లాక్ పీరియడ్‌‌కు గాను ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులను నిర్ణయించాల్సి ఉంది. దీనికోసం టీఏఎఫ్ఆర్సీ కాలేజీలు, ట్రస్టుల నుంచి 2022–23, 2023–24 సంవత్సరాలకు సంబంధించిన కాలేజీల ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్టును, 2021–22 నుంచి ఇప్పటివరకు కాలేజీల సాంక్షన్ ఇన్‌‌టెక్ వివరాలను సేకరించారు. ఈ క్రమంలోనే కాలేజీల్లో గతంలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల వివరాలను, రానున్న మూడేండ్లకు ఎంత ఫీజు ఎక్స్‌‌పెక్ట్ చేస్తున్నారనే డేటాను వారి నుంచి తీసుకున్నారు. 

అయితే మేనేజ్మెంట్లు ఇచ్చిన లెక్కల్లో అనేక తప్పులు ఉన్నట్టు లెక్చరర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొన్ని కాలేజీల్లో సిబ్బందికి జీతాలు ఎక్కువగా వేసి.. ఆ తర్వాత వారి నుంచి రిటర్న్ తీసుకుంటున్నారు. లైబ్రరీల్లో పుస్తకాలు, ల్యాబుల్లో పరికరాలు కొనకున్నా కొన్నట్టు బిల్లులు పెడతున్నారని చెప్తున్నారు. కాలేజీలు చేసే ఖర్చు ఆధారంగానే.. తర్వాతి సంవత్సరాలకు ఫీజులు నిర్ణయించనుండటంతో మేనేజ్మెంట్లు ఇచ్చే లెక్కలు కీలకం కానున్నాయి. ఈ లెక్కలను ఇప్పటికే ఆడిటర్ల ద్వారా టీఏఎఫ్ఆర్సీ వెరిఫై చేయించింది. 

అయితే 2022లో టీఏఎఫ్ఆర్సీ ఆడిటర్లు చేసిన తప్పిదంతో సుమారు 93 కాలేజీల్లో భారీగా ఫీజులు పెరిగాయి. చివరికి ఆ తప్పును గుర్తించి, ఆయా కాలేజీల్లో ఫీజులను తగ్గించారు. అప్పుడు కూడా టీఏఎఫ్ఆర్సీ హియరింగ్ ఆదరాబాదరాగా నిర్వహించడంతోనే ఈ సమస్య ఏర్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, ప్రస్తుతం ప్రైవేటు కాలేజీల్లో రూ.35 వేల నుంచి 1.65 లక్షల దాకా ఫీజులు ఉన్నాయి. 

చివరి రోజు 24 కాలేజీలు..

ఫిబ్రవరి 25 నుంచి మార్చి10 వరకు ఇంజనీరింగ్ కాలేజీల హియరింగ్ ఉంటుందని టీఏఎఫ్ఆర్సీ ప్రకటించింది. ఈ మేరకు కాలేజీలకు షెడ్యూల్ ఇచ్చింది. రాష్ట్రంలో 163 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు 8 రోజుల్లోనే విచారణ ప్రక్రియను పూర్తి చేసేలా షెడ్యూల్ ఉంది. ఈ లెక్కన రోజుకు 20 కాలేజీల హియరింగ్ ఉండనున్నది. 

చివరి రోజు 24 కాలేజీలను విచారణకు పిలవడం గమనార్హం. ఒక్కో కాలేజీ మేనేజ్మెంట్‌‌ను 10 నుంచి 20 నిమిషాలు మాత్రమే విచారణ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇలాంటి ప్రక్రియతో కాలేజీలు చేసే తప్పిదాలను గుర్తించడం ఇబ్బందికరంగా ఉంటుందని స్టూడెంట్ యూనియన్లు చెప్తున్నాయి. 

కాలేజీలు తప్పుడు లెక్కలిస్తున్నయ్

చాలా ఇంజనీరింగ్ కాలేజీలు టీఏఎఫ్ఆర్సీకి తప్పుడు లెక్కలు ఇచ్చాయి. సిబ్బందికి ఇస్తున్న జీతాలు, ల్యాబ్ డెవలప్‌‌మెంట్, లైబ్రరీ తదితర వాటిపై విచారణ చేస్తే తప్పులన్నీ బయట పడతాయి. సిబ్బంది బ్యాంకు ఖాతాలను చూస్తే జీతాల బాగోతం తెలుస్తుంది. టీఏఎఫ్ఆర్సీ అధికారులు పైపైన కాకుండా సమగ్రంగా విచారణ జరిపించాలి. ఈ విషయమై టీఏఎఫ్ఆర్సీ, టీజీసీహెచ్‌‌ఈ చైర్మన్లకు లేఖలు రాశాను. సంతోష్ కుమార్, టీఎస్​టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు