
న్యూఢిల్లీ: 26/11 ముంబై పేలుళ్ల కుట్రదారు తహవూర్ రాణాను ఎన్ఐఏ అధికారులు అమెరికా నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో ఇండియాకు తీసుకొస్తున్నారు. గురువారం ఉదయంకల్లా ఇక్కడికి చేరుకుంటారు. అమెరికాలో ఎలాంటి న్యాయపరమైన అవకాశాలు లేకపోవడంతో అక్కడి అధికారులు తహవూర్ రాణాను ఎన్ఐఏకు అప్పగించారు. తనను ఇండియాకు అప్పగించడంపై స్టే విధించాలని కోరుతూ అమెరికా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను జడ్జి తాజాగా కొట్టేశారు. దీంతో రాణాను ఇండియాకు తీసుకెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. మార్చిలోనూ సుప్రీం కోర్టులో రాణా పిటిషన్ దాఖలు చేశాడు.
తాను అబ్డామినల్ అయోర్టిక్ అనూరిజంతో బాధపడుతున్నట్లు తెలిపాడు. పార్కిన్సన్, బ్లాడర్ క్యాన్సర్ కారణంగా తాను జర్నీ చేయలేనని వివరించాడు. ఇండియాలో తనకు ప్రాణహాని ఉందని చెప్పాడు. కొందరు తనను టార్గెట్ చేసుకున్నారని వివరించాడు. రాణా వాదనలతో ఏకీభవించని జడ్జి.. పిటిషన్ విచారణకు తిరస్కరించారు. కాగా, రాణాను ఢిల్లీ, ముంబైలోని జైళ్లల్లో ఉంచి ముందుగా ఎన్ఐఏ అధికారులు విచారించనున్నట్లు సమాచారం.
ఫిబ్రవరిలో ట్రంప్, మోదీ అమెరికాలో భేటీ అయ్యారు. జాయింట్ ప్రెస్మీట్లో రాణా అప్పగింతపై అప్పుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2008 ముంబై టెర్రర్ అటాక్‌కు ముందు రాణాతో పాకిస్థాన్ – అమెరికన్ టెర్రరిస్ట్ డేవిడ్ హెడ్లీ టచ్‌లో ఉన్నాడు. 26/11 దాడికి ముందు 8 సార్లు హెడ్లీ ఇండియాకు వచ్చాడని .. ఆ టైమ్‌లో 231 సార్లు రాణాతో సంప్రదింపులు జరిపాడని తెలిసింది. లష్కరే తాయిబా కోసం రాణా పని చేస్తున్నాడు. పాకిస్థాన్‌లోని ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌తో దగ్గరి సంబంధాలు ఉన్నాయి.