
న్యూయార్క్: ముంబై దాడుల కేసులో కీలక నిందితుడైన తహవూర్ రాణాకు అమెరికా సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనను భారత్‌కు అప్పగించవద్దంటూ అతడు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. తహవూర్ రాణాను భారత్‌కు అప్పగిస్తామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పోయిన నెలలో ప్రకటించారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ తహవూర్ రాణా ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశాడు.
‘‘నేను పాకిస్తాన్‌కు చెందిన ముస్లిం. నన్ను భారత్‌కు అప్పగిస్తే చిత్రహింసలకు గురిచేస్తారు. అంతేకాకుండా గుండెపోటు, పార్కిన్సన్, బ్లాడర్ క్యాన్సర్, కిడ్నీ, ఆస్తమా సంబంధిత సమస్యలతో పోరాడుతున్నాను. ఇలాంటి తరుణంలో నన్ను ఇండియాకు అప్పగించడమంటే మరణశిక్ష విధించడమే” అని పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీనిపై సుప్రీంకోర్టు అసోసియేట్ జస్టిస్ ఎలెనా కాగన్ విచారణ చేపట్టారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ వాదనలు వినిపిస్తూ.. ‘‘భారత్ అతిపెద్ద సెక్యులర్ దేశం. అక్కడ జాతి, మతం ఆధారంగా వివక్ష చూపించరు” అని చెప్పారు. వాదనలు విన్న జడ్జి.. రాణా పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. కాగా, తన అత్యవసర పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో తహవూర్ రాణా మరో పిటిషన్ దాఖలు చేశాడు. భారత్‌కు తన అప్పగింతను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర అప్లికేషన్ ఫైల్ చేశాడు.