- ఏడాదిగా డీసీవో ఆఫీస్ నిప్పు కేసు పెండింగ్
- ఎవిడెన్స్ సేకరించకుండా నిందితులను తప్పించారనే అనుమానాలు
- రాజకీయ అండతో కేసులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు
గద్వాల, వెలుగు: కీలక కేసుల్లో ఆఫీసర్లు, పోలీసులు ఎంక్వైరీ చేయకుండా మిన్నకుంటున్నారనే ఆరోపణలున్నాయి. రెండేండ్ల కింద మానవపాడు తహసీల్దార్ ఆఫీస్ లోని రికార్డు రూమ్, ఏడాది కింద డీపీవో ఆఫీస్ లో కీలక ఫైళ్లు కాలిపోయాయి. ఏడాదిన్నర కింద అక్రమ మైనింగ్ వ్యవహారంలో మేఘా కంపెనీకి నోటీసులు ఇచ్చినా, ఇప్పటివరకు ఒక్క రూపాయి ఫైన్ కట్టించలేదు.
ఇలా కీలక కేసులన్నింటిలో జిల్లా ఆఫీసర్లు సైలెన్స్‌గా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ నాయకుల అండతో ఈ కేసుల్లోని నిందితులు బయటపడుతున్నారనే విమర్శలున్నాయి. సాధారణ వ్యక్తులు చిన్న తప్పు చేసినా విచారణ పేరుతో హడావుడి చేసి అరెస్ట్ చేసే పోలీసులు జిల్లాలో రెండు ఆఫీసుల్లో ముఖ్యమైన రికార్డులను కాలబెట్టారనే ఆరోపణలున్నా ఇప్పటివరకు ఎంక్వైరీ పూర్తి చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సాక్షాలు, ఆధారాలు సేకరించడంలో అప్పటి ఆఫీసర్లు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలున్నాయి.
రెండేండ్లు దాటినా..
2002 అక్టోబర్ 25న షార్ట్ సర్క్యూట్ తో మానవపాడు తహసీల్దార్ ఆఫీస్ రికార్డు రూమ్ దగ్ధమైందని అప్పటి తహసీల్దార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఓ మినిస్టర్ భూ లావాదేవీల రికార్డులను మాయం చేసేందుకే నిప్పు పెట్టి, షార్ట్ సర్క్యూట్ డ్రామా ఆడుతున్నారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. శ్రీశైలం ముంపు బాధితుల రికార్డులతో పాటు మాజీ మినిస్టర్ కొన్న భూముల రికార్డులు కాలిపోవడంతో వాటి స్థానంలో అక్రమంగా రికార్డులు సృష్టించారనే ఆరోపణలున్నాయి. ఆ కేసులో ఇప్పటివరకు ఎంక్వైరీ పూర్తి చేయలేదు. దీనికి బాధ్యులుగా జూనియర్ అసిస్టెంట్ ప్రేమ్ కుమార్, తలారి వెంకట్రాముడుపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఫైల్స్ మాయం చేసేందుకే..
గత ఏడాది ఫిబ్రవరిలో డీపీవో ఆఫీసుకు నిప్పు పెట్టిన ఘటనలో ఇప్పటివరకు ఒక్క ఆధారం కూడా పోలీసులు సేకరించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యమైన ఫైల్స్ మాయం చేసేందుకే డీపీవో ఆఫీస్ కాలబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. 2016లో గట్టు మండలంలోని పలు జీపీల్లో అక్రమాలు జరిగాయనే ఫిర్యాదులు వచ్చాయి. ఆడిట్ ఆఫీసర్లు కూడా అక్రమాలు జరిగాయని నిర్ధారించారు.
విజిలెన్స్ ఎంక్వైరీలో 8 మంది పంచాయతీ కార్యదర్శులు అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. వారిపై చర్యలు తీసుకునే ఫైల్ డీపీవో టేబుల్ పై ఉందనే విషయం తెలుసుకున్న అక్రమార్కులు ఆ ఫైల్ మాయం చేసేందుకు డీపీవో ఛాంబర్ ను టార్గెట్ చేస్తూ నిప్పు పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో ఓ కార్యదర్శి ఇల్లీగల్ గా 17 నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చాడు. ఉన్నతాధికారులు నిర్మాణాలను ఆపితే, ఒకరు కోర్టుకు వెళ్లారు. కోర్టుకు కూడా తప్పుడు పర్మిషన్ ఇచ్చిన విషయాన్ని తెలియజేసి సదరు సెక్రటరీని సస్పెన్షన్ చేశారు.
రీ ఎంట్రీ కోసం పైరవీ చేసుకుంటున్న సదరు సెక్రటరీ, పాత ఫైలుతో ఫ్యూచర్ లో ఇబ్బందులు రావద్దనే ఉద్దేశంతో నిప్పుపెట్టారనే ఆరోపణలున్నాయి. అయినప్పటికీ ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా చేతులు దులుపేసుకున్నారనే విమర్శలున్నాయి. ఈ రెండు కోసుల్లో పోలీసులు ఎంక్వైరీ పూర్తి స్థాయిలో చేయలేదని అంటున్నారు. ఘటన జరిగిన వెంటనే సీసీ కెమెరాలు పరిశీలించి, పుటేజీ సేకరించి ఉంటే బలమైన ఆధారాలు దొరికేవని చెబుతున్నారు.
ఎవిడెన్స్ కలెక్ట్ చేయలేదనే విమర్శలున్నాయి. డీపీవో, మానవపాడు తహసీల్దార్ ఆఫీస్ రికార్డ్ రూమ్ కు నిప్పు పెట్టిన వ్యవహారం ఇంటి దొంగల పనేనని స్పష్టమైంది. వారిని కాపాడేందుకు రాజకీయ నాయకులు అండగా నిలిచారని అంటున్నారు. దీంతో పోలీసులు కూడా ఎంక్వైరీ చేయకుండా వదిలేశారనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో సర్కారు మారడం, అప్పటి ఆఫీసర్లంతా బదిలీ కావడంతో ఈ కేసులో కదలిక వస్తుందని అంటున్నారు.
ఎవిడెన్స్ దొరకడం లేదు..
డీపీవో ఆఫీస్‌కు నిప్పు పెట్టిన కేసులో ఎవిడెన్స్ దొరకడం లేదు. ఈ విషయంలో ఎవరూ స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. దీంతో ఎంక్వైరీ ఇబ్బందిగా మారింది. మానవపాడు కేసు కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. త్వరలోనే కేసును చేదిస్తాం.
వెంకటేశ్వర్లు, డీఎస్పీ, గద్వాల