తహశీల్దార్లకు మళ్లీ అధికారాలియ్యాలె

సంస్కరణల పేరుతో రెవెన్యూ వ్యవస్థలో తెచ్చిన మార్పులు తెలంగాణ సమాజానికి కొత్త ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. గతంలో నాలుగంచెల పాలనా వ్యవస్థ ఉండేది. ప్రస్తుతం అది రెండంచెల వ్యవస్థగా మారింది. రెవెన్యూ శాఖకు మంత్రి లేరు. చీఫ్​ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటర్​ లేరు. వీఆర్‌‌వో వ్యవస్థను కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. కలెక్టర్లు.. మంత్రులు, చీఫ్ సెక్రటరీలకే జవాబుదారీగా ఉండటం వలను భూమి వ్యవహారాల గురించి పట్టించుకునే తీరిక వారికి లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా తహశీల్దార్​కు జాయింట్ సబ్ రిజిస్ట్రార్​ హోదాను అదనంగా ఇచ్చి కుర్చీకే అతుక్కుపోయేలా చేసింది. గతంలో ఉన్నటువంటి తహశీల్దార్ల అధికారాలన్నీ నిర్వీర్యమైపోయాయి. అన్ని రకాల రెవెన్యూ సమస్యలకు పరిష్కారంగా 'ధరణి' పోర్టల్‌‌ను తీసుకొచ్చారు. వ్యవసాయ భూమిలో పేరు తప్పులున్నా, అసైన్మెంట్ పట్టా, ఇనాం పట్టా లేదా టెనెంట్ భూమిలో పేరు తప్పున్నా, భూమి సరిహద్దుల్లో వివాదాలున్నా, హద్దు బందుల్లో తేడాలొచ్చినా ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ప్రస్తుతం ఉన్న ధరణి ప్రకారం వివాదాలు, పేర్లు మార్చే అధికారం తహశీల్దార్​కు లేదు. ఈ అధికారం కలెక్టర్​కు దఖలుపరిచారు. కలెక్టర్​ను సామాన్యులు కలవటం చాలా కష్టం. గతంలో ప్రతి సోమవారం ప్రజావాణి, ప్రజాదర్బార్, ప్రజలతో కలెక్టర్ పేరుతో కలెక్టర్​ను కలిసే అవకాశం ఉండేది. ప్రస్తుతం అదీ బంద్ అయింది. ఏ ప్రభుత్వ వ్యవస్థలనైనా నిర్వీర్యం చేయడం మంచిది కాదు. చూస్తూ ఊరుకోవడం ఉద్యోగులకు, సమాజానికి మంచిది కాదు. టీఎన్‌‌జీవో, ట్రెసా(తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్) లాంటి ఉద్యోగ సంఘాలు ముందుకొచ్చి ప్రభుత్వాన్ని మేల్కొలిపేలా చూడాలి. ప్రభుత్వ ఉద్యోగులను సమీకరించి, అన్ని సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడాలి. ఇందులో తహశీల్దార్లను ముందు ఉంచి గతంలో ఉన్నటువంటి అధికారాలను తిరిగి పొందేలా ఉద్యోగులు, ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేయాలి. తహశీల్దార్లు ప్రజల కోసం పని చేయటానికి తిరిగి కోల్పోయిన అధికారాలను పొందేలా చేయాలి.                               - వి.బాలరాజు, రిటైర్డ్​ తహశీల్దార్​