Evergreen: ఈ సంస్థ ఉద్యోగులకు బోనస్ గా నాలుగేళ్ల జీతం

Evergreen: ఈ సంస్థ ఉద్యోగులకు బోనస్ గా నాలుగేళ్ల జీతం

తైపీ : కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులకు బోనస్ లు ఇస్తే వారికి చెప్పలేని సంతోషం కలుగుతుంది. కొన్ని కంపెనీలు,సంస్థలు..ప్రత్యేక సందర్భాలు, పండుగల సమయాల్లో ఉద్యోగులకు బోనస్ లు ఇస్తుంటాయి. దీని వల్ల ఉద్యోగులు కూడా సంతోషంగా పని చేస్తుంటారు. కంపెనీ లేదా సంస్థ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా, గడువు లోపు పూర్తి చేస్తారు. అయితే..తైవాన్‌కు చెందిన ఓ కంపెనీ కూడా తమ ఉద్యోగులకు ఏకంగా నాలుగు సంవత్సరాల పాటు బంపర్ ఆఫర్ ప్రకటించి.. ఉద్యోగుల్లో సంతోషం నింపింది. 

తైవాన్‌కు చెందిన ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్పొరేషన్‌ తమ ఉద్యోగులకు భారీ స్థాయిలో బోనస్ లు ప్రకటించింది. ఏకంగా నాలుగు సంవత్సరాల జీతాన్ని బోనస్‌గా ఇస్తోంది. ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్పొరేషన్‌ షిప్పింగ్ సంస్థ 50 నెలల జీతంతో సమానమైన బోనస్‌ను ఇస్తోంది. అంటే నాలుగు సంవత్సరాల జీతం కంటే ఎక్కువే. ఉద్యోగి జాబ్ గ్రేడ్‌, తైవాన్‌ ఆధారిత కాంట్రాక్టులు కలిగిన సిబ్బందికి మాత్రమే ఇది వర్తిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. 

గత రెండు సంవత్సరాల్లో ఈ సంస్థ వ్యాపారం భారీస్థాయిలో పెరిగింది. 2022లో దీని ఆదాయం 20.7బిలియన్ల డాలర్లకు పెరగనుందని అంచనా. 2020తో పోల్చుకుంటే అది మూడు రెట్లు అధికం. అయితే ఈ బోనస్‌ అదృష్టం ఉద్యోగులందరికీ దక్కడం లేదని తెలుస్తోంది. గత ఏడాది ఈ సంస్థ పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. దీనికి చెందిన నౌక ఒకటి ఈజిప్ట్‌లోని సూయిజ్‌ కాలువలో అనూహ్యంగా ఇరుక్కుపోయింది.దాంతో కొద్దిరోజుల పాటు ఇతర నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.