ఉత్తర భారతంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. కుండపోత వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. అటు హర్యానా, ఢిల్లీల్లో ఎడతెరిపి లేని వానలకు యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో చారిత్రక కట్టడం తాజ్ మహల్ కు యమునా నది తాకింది. తాజ్ మహల్ గోడలు, గార్డెన్ లోకి యమునా నది వరద నీరు వచ్చి చేరింది.
45 ఏండ్ల తర్వాత..
తాజ్‌మహల్ దగ్గర యమునా నది వరద గరిష్ఠ స్థాయి అయిన 495 అడుగులను దాటి 497.9 అడుగులకు చేరింది. దాంతో యుమునా నది వరదనీరు తాజ్‌మహల్ పరిసరాల్లోకి ప్రవేశించింది. ఇతిమద్-ఉద్-దౌలా సమాధి బయటి భాగాలలోకి కూడా నీరు వచ్చేసింది. గడిచిన 45 ఏళ్లలో తొలిసారిగా తాజ్ మహల్ పరిసరాల్లోకి యమునా నది వరద నీరు ప్రవేశించింది.
చివరి సారి ఎప్పుడు..?
గతంలో 1978లో యమునా నది వరదలవల్ల తాజ్ మహల్ తీవ్రంగా ప్రభావితమైంది. దాదాపు 508 అడుగుల ఎత్తులో యమునా నది ప్రవహించింది. దీంతో తాజ్‌మహల్ బేస్‌మెంట్‌లోని 22 గదుల్లోకి వరద నీరు చేరింది. ప్రస్తుతం ఆ స్థాయిలో కాకున్నా తాజ్‌మహల్ పరిసరాల్లోకి వరదనీరు రావడం ఇదే తొలిసారి.
ముప్పు ఉందా..?
యమునా నది ఉధృతి మరింత పెరిగినా..తాజ్ మహల్కు ముప్పేమీ లేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. వరద ఉధృతి పెరిగినా.. తాజ్ మహల్ ప్రధాన సమాధిలోకి నీరు ప్రవేశించని విధంగా తాజ్ మహల్‌ను నిర్మించారని వెల్లడించారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ వారసత్వ కట్టడానికి వరదల వల్ల ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు.