పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించింది హైకోర్టు. ఒక వేళ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసును మళ్ళీ విచారిస్తామని హైకోర్టు సూచించింది.
ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను అనర్హులుగా ప్రకటించాలంటూ బీజేపీ నేతమహేశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లను ఆగస్టులో విచారించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. సెప్టెంబర్ 9న (ఇవాళ) తీర్పు వెల్లడించిన హైకోర్టు..నాలుగు వారాల్లో ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ఆఫీస్ కు నోటీసులు జారీ చేసింది. నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసును విచారిస్తామని స్పష్టం చేసింది హైకోర్టు.