
- ఉదయం 7 గంటలకే డ్యూటీలో ఉండాలె
- చెత్త సేకరిస్తుండగా సెల్ఫీ తీసి యాప్ లో పెట్టాలని ఆదేశం
- ఆఫీసర్ల తీరుపై మండిపడుతున్న సెక్రటరీలు
- భద్రాద్రిలో ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు నిర్ణయం
మంచిర్యాల, వెలుగు: ఇప్పటికే పనిభారంతో పరేషాన్ అవుతున్న పంచాయతీ సెక్రటరీలపై ఆ డిపార్ట్మెంట్ఆఫీసర్లు మరింత భారం మోపుతున్నారు. రోజుకో కొత్త రూల్ తీసుకొస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో ఉన్నతాధికారుల తీరుపై సెక్రటరీలు మండిపడుతున్నారు. పంచాయతీ సెక్రటరీలు రోజూ పొద్దుగాల 7 గంటలలోపే అటెండెన్స్ ఇవ్వాలని, ట్రాక్టర్‌తో చెత్త సేకరిస్తుండగా ఇంజన్‌పై డ్రైవర్ పక్కన కూర్చొని సెల్ఫీ తీసి పంచాయతీ సెక్రటరీల(పీఎస్) యాప్‌లో అప్లోడ్ చేయాలని ఈ నెల 21న ఆర్డర్స్ జారీ చేశారు. ఇంతకుముందు వారానికి రెండు రోజులు 7 గంటలలోపు డ్యూటీకి వచ్చి అటెండెన్స్ఇవ్వాలనే రూల్ ఉండేది. దీనిని క్యాన్సిల్ చేయాలని ఓవైపు సెక్రటరీలు డిమాండ్చేస్తుంటే.. మరోవైపు ఉన్నతాధికారులు డెయిలీ 7 గంటలలోపే డ్యూటీలో ఉండాలని ఆర్డర్స్ ఇవ్వడంతో షాక్ తిన్నారు. చాలామంది సెక్రటరీలు కుటుంబ అవసరాలు, పిల్లల చదువుల దృష్ట్యా జిల్లా హెడ్‌క్వార్టర్‌లో లేదా దగ్గరలోని మండల హెడ్‌క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. వీళ్లు పొద్దున్నే ఏడింటికి డ్యూటీలో ఉండాలంటే ఆరింటికే బయల్దేరాలి. ఇక లేడీస్ పొద్దున్నే లేచి ఇంటి పనులు చేయడం, పిల్లలను రెడీ చేసి స్కూల్‌కు పంపడం, ఇలా ఎన్నో పనులు ఉంటాయి.
పని భారంతో సతమతం
పంచాయతీ సెక్రటరీలు ఇప్పటికే పనిభారంతో సతమతమవుతున్నారు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చేసినా ఒడవని పని చెప్తున్నారని వాపోతున్నారు. ఇంటింటా చెత్త సేకరణ, సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డ్‌కు తరలించడం, తడి చెత్తతో కంపోస్టు తయారీ, పొడి చెత్తను వేరు చేసి అమ్మడం, డ్రైనేజీలు క్లీన్ చేయించడం, రోడ్లు ఊడ్పించడం, ట్యాక్స్కలెక్షన్, వాటర్సప్లై, అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీ వర్క్స్మానిటరింగ్ చేయడంతో పాటు గవర్నమెంట్ప్రోగ్రామ్స్, ఆఫీసర్ల మీటింగులతో పొద్దుపోయే వరకూ తీరిక ఉండడం లేదంటున్నారు. ఆయా పనులకు సంబంధించి రోజూ ఆరు ఫొటోలను యాప్‌లో అప్లోడ్ చేయడం తప్పనిసరి. అలాగే ఈజీఎస్పనులను సైతం ప్రభుత్వం సెక్రటరీలకే కట్టబెట్టింది. గ్రామంలో చేపట్టే పనులను గుర్తించడం, వాటిని పర్యవేక్షించడం, డెయిలీ 50 మంది కూలీలకు పని కల్పించడం వీళ్ల బాధ్యతే. కూలీల సంఖ్య తగ్గితే షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లతో టెన్షన్ పడుతున్నారు.ఇది చాలదన్నట్టు కొత్త రూల్‌తో తమకు మరిన్ని కష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మల్టీపర్పస్ వర్కర్లు ఏరీ?
పంచాయతీలో అన్నిరకాల పనులకు సెక్రటరీలను బాధ్యులను చేసిన ప్రభుత్వం అందుకు అవసరమైన వర్కర్లను మాత్రం నియమించడం లేదు. 2011 సెన్సెస్ ప్రకారం 500 మంది జనాభాకు ఒక మల్టీపర్పస్ వర్కర్‌ను సర్కారు కేటాయించింది. గతంలో ఒక గ్రామంలో 2 వేల జనాభా ఉంటే ప్రస్తుతం 3వేలకు చేరింది. ఈ లెక్కన మరో ఇద్దరు వర్కర్లు అవసరమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒకరిద్దరు వర్కర్లు ఉన్న పంచాయతీల్లో శానిటేషన్ పరిస్థితి దయనీయంగా తయారైంది. దీనికి సెక్రటరీలను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
సమ్మెకు రెడీ
ప్రభుత్వం రోజుకో రూల్ తీసుకొస్తూ విపరీతమైన పనిభారం మోపడంపై సెక్రటరీలు మండిపడుతున్నారు. గతంలో డెయిలీ శానిటేషన్ రిపోర్ట్(డీఎస్సార్) ఉదయం 11 గంటలలోపు పూర్తి చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఏడింటికే సెక్రటరీలు ట్రాక్టర్ మీద కూర్చుని ఫొటో దిగాలని చెబుతుడడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు 7 గంటలకే డీఎస్సార్ ఇవ్వాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సెక్రటరీలు సమ్మెకు రెడీ అయ్యారు. ఫిబ్రవరి 7నుంచి డ్యూటీలు బహిష్కరించి నిరసన తెలుపుతామని ఆ జిల్లా సెక్రటరీల సంఘం ఇప్పటికే డీపీవోకు నోటీసు ఇచ్చింది. మిగతా జిల్లాల సెక్రటరీలు సోమవారం సమావేశమై తమ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొంటున్నారు.