- సీఎం రేవంత్‌కు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ విజ్ఞప్తి
- పదేండ్లలో వేల కోట్లు సంపాదించారని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేతల అవినీతి, పదేండ్ల దోపిడీ, స్కామ్‌లపై సమగ్ర విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రవీంద్ర నాయక్ విజ్ఞప్తి చేశారు. రుణమాఫీ, ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే ఓర్వలేక.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం రవీంద్రనాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు.
పదేండ్ల పాలనలో బీఆర్ఎస్నేతలు వేల ఎకరాలు కబ్జా చేశారని, వేల కోట్ల అవినీతి జరిగిందని, ల్యాండ్, శాండ్, గ్రానైట్, డ్రగ్స్, లిక్కర్ ఇలా అన్ని మాఫియాలు చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం ఏటీఎంలాగా వాడుకున్నదని ఆరోపించారు. అసెంబ్లీ , ఎంపీ ఎన్నికల్లో పబ్లిక్ బుద్ధి చెప్పినా.. వారు ఇంకా మారలేదని మండిపడ్డారు.
ప్రతిపక్ష నేతగా ఉండి కనీసం వరద బాధితులను కూడా పరామర్శించకుండా కేసీఆర్ ఫాంహౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారని రవీంద్రనాయక్ ఫైర్అయ్యారు. 2014 కు ముందు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఆస్తులు ఎన్నో రాష్ట్ర ప్రజలకు తెలుసునని అన్నారు. ఎంతో కష్టపడి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత హరీశ్‌రావు, కేటీఆర్ కు లేదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ కుటుంబం తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల్లో అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్ధలతో విచారణ జరిపించాలని కేంద్ర సర్కారును డిమాండ్ చేశారు.